- మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిన కేంద్రం
- చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్
- స్వాగతించిన రాహుల్ గాంధీ
- ముందు కుల గణన, డీలిమిటేషన్ సమస్యలు పరిష్కరించాలని వెల్లడి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తూనే కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో కుల గణన డిమాండ్ నుంచి దృష్టి మరల్చడానికి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చారని ఆరోపించారు. ఇది ప్రజలను దారిమళ్లించే ఎత్తుగడ అని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడానికి ముందు జనాభా గణన ఆవశ్యకత, డీలిమిటేషన్ సమస్యను పరిష్కరించాల్సి ఉందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
“చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కోటా మంచిదే. కానీ కుల గణన, డీలిమిటేషన్ అంశాలు కూడా ముఖ్యమైనవే. ముందు వాటిని పరిష్కరించడంపై కేంద్రం శ్రద్ధ చూపాలి” అని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కు వీలు కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.