- ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లంట్
- హమాస్ లక్ష్యాలపై పూర్తి స్థాయిలో దాడులకు ప్రణాళిక
- ఐదో రోజుకు చేరుకున్న యుద్ధం.. 2,000కు పైనే మృతి
హమాస్ లక్ష్యాలపై పూర్తి స్థాయిలో దాడులు చేయనున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ప్రకటించారు. గాజా సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించనున్నట్టు చెప్పారు. నిర్బంధంలో ఉన్న అందిరినీ విడిచిపెట్టినట్టు చెప్పారు. హమాస్ నియంత్రణలోని ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు తెలిపారు. గాజా మునుపటి స్థితిలోకి వెళ్లడం అసాధ్యమని తేల్చి చెప్పారు. ఇందుకు హమాస్ విచారించడం ఖాయమన్నారు. గాజాలో మార్పును హమాస్ కోరుకుంటోందని, అది అనుకున్న స్థితి నుంచి 180 డిగ్రీలు మారుతుందన్నారు.
అంతిమంగా హమాస్ ను ఇజ్రాయెల్ ఏరిపారేస్తుందన్నారు. హమాస్ సీనియర్ సభ్యులను అంతమొందించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ రక్షణ దళాల అధికార ప్రతినిధి అడ్మిరల్ డానియల్ హగారి తెలిపారు. దక్షిణ ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్ల కోసం ఇప్పటికీ గాలిస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు రెండు దేశాల మధ్య యుద్ధం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడిని కొనసాగిస్తున్నాయి. దీంతో గాజాలో భవనాలు తునాతునకలు అవుతున్నాయి. గాయపడిన వారితో గాజాలోని ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు ఇరువైపులా 2,000కుపైనే మరణించినట్టు సమాచారం. ఇందులో ఎక్కువ ప్రాణ నష్టం ఇజ్రాయెల్ వైపు నుంచే ఉంది.