Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అన్నీ మా మేనిఫెస్టోలోని అంశాలే… కాపీ కొట్టారు: బీఆర్ఎస్ మేనిఫెస్టోపై రేవంత్ స్పందన

  • తెలంగాణ ఎన్నికలకు మోగిన నగారా
  • నేడు మేనిఫెస్టో ప్రకటించిన సీఎం కేసీఆర్
  • తమ 6 గ్యారెంటీలను పోలిన హామీలే ఇచ్చారన్న రేవంత్
  • కేసీఆర్ ఆలోచించే శక్తిని కోల్పోయారంటూ ఎద్దేవా

మహిళలకు రూ.3 వేలు, రూ.400కే గ్యాస్ సిలిండర్ తదితర హామీలతో సీఎం కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను పోలిన హామీలను బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచారని ఆరోపించారు. 

“మహాలక్ష్మి పథకం కింద మేం రూ.2,500 అంటే కేసీఆర్ ఇవాళ రూ.3 వేలు అన్నారు… ఆడబిడ్డలకు మేం రూ.500 గ్యాస్ సిలిండర్ అంటే ఆయన రూ.400 అన్నాడు… పెన్షన్ల విషయంలో మేం రూ.4 వేలు అంటే ఆయన రూ.5 వేలు అన్నాడు… మేం ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ.15 వేలు ఇస్తామంటే… ఆయన ఇప్పుడు రూ.16 వేలు ఇస్తామంటున్నాడు. 

ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ గతంలో సారా పాటలు నిర్వహించేవారు. అయితే, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనకుండానే కేసీఆర్ మమ్మల్ని కాపీ కొట్టి పెద్ద లోయలో పడిపోయారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే… రాష్ట్రం దివాళా తీయడమే కాదు, కేసీఆర్ బుర్ర కూడా దివాళా తీసింది. కేసీఆర్ లో ఆలోచించే శక్తి సన్నగిల్లింది. 

కేసీఆర్, బీఆర్ఎస్ ఇక ఎంతమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. కేసీఆర్, ఆయన పార్టీ పరాన్నజీవులు. పక్కవాళ్ల మీద ఆధారపడి బతికేవాడు పరాన్నజీవి. ప్రజా సంక్షేమం పట్ల ఆలోచన, చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీలో లోపించాయనడానికి వాళ్ల మేనిఫెస్టోనే నిదర్శనం. 

గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాగితంపై రాసుకుని ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మేం రూ.4 వేల పెన్షన్, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే… అదెలా సాధ్యమవుతుంది? అంటూ ఇన్నాళ్లు మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వారి మేనిఫెస్టో పట్ల ఏం సమాధానం చెబుతారు?

రైతులకు మేం ఇందిరమ్మ భరోసా కింద రూ.15 వేలు ఇస్తామంటే… అదెలా సాధ్యమవుతుంది అన్నారు… పేదలకు ఇళ్ల స్థలాల కోసం రూ.5 లక్షలు ఇస్తామంటే… నిధులు ఎక్కడ్నించి తెస్తారు అని మమ్మల్ని ప్రశ్నించారు… రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద మేం రూ.10 లక్షలు ఇస్తామంటే… అది అసాధ్యమన్నారు…   ఇప్పుడదే బీఆర్ఎస్ నేతలు రూ.15 లక్షల బీమా అని ప్రకటించారు. కేసీఆర్ బీమా అంటూ మరో రూ.5 లక్షలు అంటున్నారు. 

ఈ విధంగా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు సొంత ఉనికిని, గుర్తింపును కోల్పోయారని వారి మేనిఫెస్టో చూశాక అర్థమైంది. నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలు చూశాక వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సేనని, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని నాలుగు కోట్ల మంది ప్రజానీకానికి అర్థమైంది. ఈ హామీలను ఎలా అమలు  చేస్తారు? అని మమ్మల్ని అడిగే అర్హతను కేసీఆర్ కోల్పోయారు” అంటూ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.

Related posts

రాజకీయాల్లో నీతికి పాతర …అన్ని పార్టీల్లో జంపింగ్ లు

Ram Narayana

కేకే స్థానంలో… తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మనుసింఘ్వీ!

Ram Narayana

 52 పేర్లతో బీజేపీ తొలి జాబితా.. రెండు చోట్ల ఈటల పోటీ

Ram Narayana

Leave a Comment