Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

గగన్ యాన్ టీవీ డీ 1 ప్రయోగం విజయవంతం

  • 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన మిషన్
  • తిరిగి సేఫ్ గా సముద్రంలో ల్యాండింగ్
  • గగన్ యాన్ ప్రాజెక్ట్ లో ఇది కీలక సన్నాహక పరీక్ష అన్న ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్ యాన్ ’ లో కీలక సన్నాహక పరీక్ష టీవీ డీ1 (టెస్ట్ వెహికల్ డెమాన్ స్ట్రేషన్ 1) ను శనివారం సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. క్రూ మాడ్యుల్ ప్రయోగంలో భాగంగా సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ ను నింగిలోకి పంపింది. తొలుత ఈ ప్రయోగాన్ని శనివారం ఉదయం 8 గంటలకు నిర్వహించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. అయితే, చివరి క్షణంలో సాంకేతిక లోపంతో మిషన్ ఆగిపోయింది. అనంతరం లోపాన్ని గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు దానిని సవరించి షెడ్యూల్ టైమ్ కు రెండు గంటలు ఆలస్యంగా ప్రయోగం నిర్వహించారు. గగన్ యాన్ ప్రాజెక్టులో అనూహ్య పరిస్థితులు ఎదురైతే ప్రయోగాన్ని రద్దు చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ ప్రయోగం లక్ష్యమని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ 17 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత శాస్త్రవేత్తలు ‘అబార్ట్’ సంకేతం పంపారు. దీంతో రాకెట్ లోని క్రూ ఎస్కేప్ వ్యవస్థ యాక్టివేట్ అయింది. రాకెట్ నుంచి విడివడి పారాచూట్ సాయంతో సముద్రంలో ల్యాండ్ అయింది. ప్రయోగం ఆద్యంతం అనుకున్నట్లుగానే కొనసాగిందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ వివరించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ అభినందనలు తెలిపారు.

అంతకు ముందు ...

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా శనివారం(అక్టోబర్ 21) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరగాల్సిన ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’ (టీవీ-డీ1) నిలిచిపోయింది. ఇంజన్ జ్వలన (ఇగ్నిషన్) ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో ప్రయోగానికి కొన్ని సెకన్ల ముందు ప్రయోగం నిలిచిపోవడం అనివార్యమైంది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. క్రమరాహిత్యం కారణంగా ఆన్‌బోర్డ్ కంప్యూటర్ ప్రయోగాన్ని నిలిపివేసిందని ఎస్.సోమనాథ్ వివరించారు. 

ఈ లోపానికి కారణాన్ని విశ్లేషించుకుని తిరిగి ప్రయోగాన్ని చేపడతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఉదయం 8 గంటలకు జరగాల్సిన ప్రయోగాన్ని తొలుత అరగంటపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత ఆటోమేటిక్ లాంచ్ సీక్వెన్స్‌కు 8.45 గంటలకు షెడ్యూల్ చేశారు. చివరికి ప్రయోగానికి కేవలం 5 సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేస్తూ ఇస్రో శాస్త్రేవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. ఇంజిన్ ఇగ్నిషన్ సాధారణంగా జరగాల్సి ఉంది. కానీ ఏం తప్పు జరిగిందో తేల్చాల్సి ఉందని సోమనాథ్ చెప్పారు. వాహనాన్ని కలిగి ఉన్న ఆటోమేటిక్ లాంచ్ సీక్వెన్స్‌ను ప్రేరేపించిన వాటిని విశ్లేషించిన తర్వాత తిరిగి ప్రయోగిస్తామన్నారు. ప్రయోగ వాహకం సురక్షితంగానే ఉందని, అతిత్వరలో ప్రయోగాన్ని షెడ్యూల్ చేస్తామన్నారు.

Related posts

దేశంలోనే తొలి హెపటైటిస్-ఏ వైరస్ నిరోధక టీకా కనిపెట్టిన హైదరాబాదీ సంస్థ

Ram Narayana

రూ.3.14 లక్షల కోట్ల విలువైన 88 శాతం రూ.2000 నోట్లు వెనక్కి వచ్చాయి: ఆర్బీఐ

Ram Narayana

నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ కోసం నామ డిమాండ్

Ram Narayana

Leave a Comment