- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కిషన్ రెడ్డి
- మునుగోడు నుంచి కాంగ్రెస్ తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరిక
- జనసేనతో సీట్ల సర్దుబాటుపై చర్చ సాగుతోందన్న కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో మునుగోడు టిక్కెట్‌ను ఆశించి భంగపడిన చలమల కృష్ణారెడ్డి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని చలమల భావించారు. కానీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టిక్కెట్ దక్కింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన అనుచరులతో భేటీ అయ్యారు. అనంతరం నేడు బీజేపీలో చేరారు.
ఈ రోజు పలువురు నేతలు బీజేపీలో చేరారు. చలమల కృష్ణారెడ్డితో పాటు బోథ్ టిక్కెట్ ఆశిస్తున్న రాథోడ్ బాపురావు, ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న సుభాష్ కూడా బీజేపీలో చేరారు.
వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లేవారు అవసరం లేదు
పలువురు నేతలు బీజేపీని వీడటంపై కిషన్ రెడ్డి స్పందించారు. వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లేవారు తమకు అవసరం లేదని మండిపడ్డారు. పార్టీని వదిలి వెళ్లేవారితో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటుపై చర్చ సాగుతోందన్నారు. మూడో విడత జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేస్తామన్నారు.