- ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని
- ధ్వజ స్తంభాన్ని మొక్కిన అనంతరం మూలవిరాట్టును దర్శించుకున్న మోదీ
- ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మన్, ఈవో, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ స్తంభానికి మొక్కారు. అనంతరం మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఆ తర్వాత హుండీలో కానుకలను సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికి, శేషవస్త్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వామివారి చిత్ర పటం, డైరీ, క్యాలండర్ లను ప్రధానికి అందించారు. మోదీ ఆలయంలోనే దాదాపు 50 నిమిషాలు గడిపారు. అనంతరం రచన గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హైదరాబాద్ కు పయనమవుతారు. ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు విధించారు. ప్రధాని వెళ్లే మార్గాలలో దుకాణాలను మూయించారు. మీడియాను కూడా అనుమతించలేదు.