-
ఓటుకు నోటు కేసు: ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్ పిటిషన్… కొట్టివేసిన హైకోర్టు
- -ఈ కేసు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందన్న రేవంత్
- -గతంలో ఇదే అంశంలో ఏసీబీ కోర్టులో పిటిషన్
- -పిటిషన్ ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు
- -ఇప్పుడు హైకోర్టులోనూ అదే ఫలితం
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ప్రతికూల ఫలితం ఎదురైంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు అని ఏసీబీ, ఈడీ చార్జిషీట్లు దాఖలు చేయడం తెలిసిందే. అయితే, ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, ఇది ఎన్నికల సంఘానికి సంబంధించిన విషయం అని పేర్కొంటూ, రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఇదే అంశంపై రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు కాగా, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన పిటిషన్ ను తోసిపుచ్చింది.
2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్ తో బేరాలు ఆడుతూ రేవంత్ ఓ వీడియోలో కనిపించడం నాడు సంచలనం సృష్టించింది. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ స్టీఫెన్ సన్ ను రేవంత్ కోరిన సమయంలో, అక్కడ సంచుల్లో రూ.50 లక్షల నగదు ఉండడం ఆయనపై ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.