Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ కు టీమిండియా ఎంపిక… 14 నెలల తర్వాత టీ20 జట్టులోకి రోహిత్ శర్మ

  • టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్
  • జనవరి 11 నుంచి 17 వరకు మూడు టీ20లు
  • టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ
  • జట్టులోకి వచ్చిన కోహ్లీ

టీమిండియాతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్థాన్ జట్టు భారత్ లో పర్యటించనుంది. జనవరి 11, 14, 17 తేదీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం నేడు టీమిండియాను ఎంపిక చేశారు. జూన్ లో టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఈ టీమ్ ను ఎంపిక చేసినట్టు అర్థమవుతోంది.

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మనే నియమించారు. తద్వారా, వచ్చే టీ20 వరల్డ్ కప్ లోనూ టీమిండియాను నడిపించేది రోహిత్ శర్మేనని తేలిపోయింది. 

అంతేకాదు, డైనమిక్ బ్యాట్స్ మన్ విరాట్  కోహ్లీ కూడా ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ కు ఎంపికయ్యాడు. ఇటీవల వన్డే వరల్డ్ కప్ ముగిశాక… రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లో కొనసాగడంపై అనిశ్చితి ఏర్పడింది. మాజీ క్రికెటర్లు, క్రికెట్ పండితులు మాత్రం రోహిత్ శర్మ, కోహ్లీ పొట్టి ఫార్మాట్లోనూ కొనసాగాలని సలహా ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్… రోహిత్ శర్మ, కోహ్లీలతో మాట్లాడి… వారు టీ20 వరల్డ్ కప్ వరకు కొనసాగేందుకు ఒప్పించినట్టు తెలిసింది. 

ఇక, ఆఫ్ఘనిస్థాన్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో ఇతర ఆటగాళ్ల వివరాలు పరిశీలిస్తే… తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, రవి బిష్ణోయ్, ముఖేశ్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్ తమ స్థానాలు నిలుపుకున్నారు. 

శివమ్ దూబేకు సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్ లను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.

ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ కు టీమిండియా ఇదే…

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేశ్ కుమార్.

Related posts

దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియా!

Drukpadam

టీమిండియా-బంగ్లాదేశ్ మొదటి టెస్టు… ముగిసిన తొలి రోజు ఆట!

Drukpadam

‘హరికేన్ బెరిల్’ ఎఫెక్ట్‌తో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమిండియా.. రంగంలోకి బీసీసీఐ!

Ram Narayana

Leave a Comment