- స్పెషల్ హైకోర్టు విధించిన శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు
- రాజ్యాంగాన్ని రద్దు చేసిన కేసుకు సంబంధించి గతంలోనే మరణశిక్ష
- ముషారఫ్ తరఫున ఎవరూ రాకపోవడంతో తమకు మరో ఆప్షన్ లేదన్న సుప్రీం బెంచ్
పాకిస్థాన్ సైనిక పాలకుడు, దివంగత జనరల్ పర్వేజ్ ముషారఫ్ కు ఆ దేశ సుప్రీంకోర్టు ‘మరణానంతరం మరణశిక్ష’ ఖరారు చేసింది. ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షను బుధవారం సుప్రీం సమర్థించింది. రాజ్యాంగాన్ని రద్దు చేసిన కేసుకు సంబంధించి ఆయనకు గతంలోనే ఈ శిక్ష పడింది. అయితే, సుదీర్ఘ కాలంపాటు అనారోగ్యంతో బాధపడిన ముషారఫ్ కోర్టు అనుమతితో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లి గతేడాది ఫిబ్రవరి 5న కన్నుమూశారు.
సైనిక తిరుగుబాటు ద్వారా 1999లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ పర్వేజ్ ముషారఫ్.. దాదాపు పదేళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఈ కాలంలో రెండుసార్లు అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగాన్ని రద్దు చేశారు. 2008లో అధికారానికి దూరమైన తర్వాత దీనికి సంబంధించిన కేసులు ఎదుర్కొన్నాడు. రాజ్యాంగాన్ని రద్దు చేయడంపై దేశద్రోహ ఆరోపణలతో కేసు నమోదు కాగా.. సుదీర్ఘ కాలం పాటు కోర్టులో విచారణ జరిగింది. 2019లో స్పెషల్ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది.
ముషారఫ్ దుబాయ్ నుంచే దీనిపై న్యాయ పోరాటం చేశారు. ఈ తీర్పును లాహోర్ హైకోర్టులో సవాల్ చేశారు. లాహోర్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించగా.. పిటిషన్ దారులు, ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. స్పెషల్ కోర్టు తీర్పుపై విచారణ జరుగుతుండగానే గతేడాది ఫిబ్రవరి 5న ఆయన దుబాయ్ లో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన తరఫు లాయర్లు సుప్రీం ధర్మాసనానికి తెలియజేశారు. ఆ తర్వాత ముషారఫ్ వారసులు తమకు అందుబాటులోకి రావడంలేదని, ఈ కేసులో పోరాడేందుకు వారు ఇంట్రెస్ట్ చూపడంలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
దీంతో ముషారఫ్ వారసులకు పాక్ సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. పాకిస్థాన్ తో పాటు విదేశాల్లోని ప్రధాన పత్రికలలో ఈ నోటీసులను ప్రచురించేలా ఆదేశాలిచ్చింది. అయనప్పటికీ వారు కోర్టుకు హాజరుకాకపోవడంతో తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించింది. ముషారఫ్ కు విధించిన మరణ శిక్షను సమర్థించడం తప్ప తమకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ క్వాజీ ఫయేజ్ ఇసా పేర్కొన్నారు. మరణానంతరం ఆయనకు మరణ శిక్షను ఖరారు చేశారు.
సుప్రీంకోర్టు తీర్పుపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది పాక్ చరిత్రలో నిలిచిపోయే తీర్పని పీపీపీ నేత ఫర్హతుల్లా బాబర్ కొనియాడారు. ‘దోషి (ముషారఫ్) ఇప్పటికే చనిపోవడంతో ఇప్పుడు ఉరి తీయడం సాధ్యం కాదు. కానీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసిన వ్యక్తిని న్యాయస్థానం దేశద్రోహిగా తేల్చడం, ఈ నేరానికి శిక్ష విధించడం స్వాగతించదగ్గ విషయం. రికార్డులకే పరిమితమైనప్పటికీ ఈ తీర్పుతో ఏ రాజ్యాంగాన్ని అయితే ఆయన అతిక్రమించాడో అదే రాజ్యాంగం ఇప్పుడు ఆయనను దోషిగా తేల్చింది. చరిత్రలో ఆయనను ఓ ద్రోహిగా నిలబెట్టింది’ అని వ్యాఖ్యానించాడు.