- చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలన్న చింతా మోహన్
- ప్రచారం చేయకుండానే గెలుస్తారని ధీమా
- చిరంజీవిని గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చిరంజీవే ఉంటారని ఆయన అన్నారు. తిరుపతి నుంచి పోటీ చేయాలని చిరంజీవిని తానే స్వయంగా ఆహ్వానిస్తానని చెప్పారు. సీఎం పదవిని సాధించేందుకు కాపులకు ఇదే సరైన సమయమని అన్నారు. తిరుపతి నుంచి పోటీ చేస్తే చిరంజీవి 50 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. చిరంజీవి నామినేషన్ వేసి వెళ్లిపోతే చాలని… ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. చిరంజీవిని గెలిపించేందుకు తిరుపతి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
గతంలో రాజకీయ సమీకరణాలు తెలియకే చిరంజీవి సీఎం కాలేకపోయారని చింతా మోహన్ అన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా చిరంజీవి అప్పట్లో సీఎం అయితే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి తనకు మంచి మిత్రుడని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 17 ఎంపీ స్థానాలు, 125 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్యం చేశారు.