లైంగిక వేధింపుల ఆరోపణలు.. నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై వేటు
-లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం సీరియస్
-సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తొలగింపు
-తిరుపతి రుయా ఆసుపత్రికి బదిలీ
లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ పై ప్రభుత్వం వేటు వేసింది. సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. ఈ లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వేధింపులపై విచారణ జరిపి, పూర్తి నివేదిక ఇవ్వాలని నిన్న మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.
మరోవైపు డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీలు ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, నివేదికను ప్రభుత్వానికి అందించాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తిరుపతిలోని రుయా ఆసుపత్రికి ఆయనను బదిలీ చేశారు. ఆయన పై బదిలీ వేటు సరిపోదని సస్పెండ్ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.