- చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమని ధ్వజం
- సంక్షేమ పథకాలకు డబ్బులు చెల్లించనివ్వకుండా ఈసీపై ఎన్డీఏ ఒత్తిడి చేసిందని మండిపాటు
- ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిదేనని స్పష్టీకరణ
ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎలా జతకడతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుది ఉసరవెల్లి రాజకీయమని, మైనార్టీల ఓట్ల కోసం వారిపై కపట ప్రేమ కురిపిస్తున్నాడని జగన్ ధ్వజమెత్తారు. ముస్లింలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం లో గురువారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు. రైతులు, మహిళలు, విద్యార్థులకు డబ్బులు చెల్లించనివ్వకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కుట్ర పన్నాయని ఆరోపించారు.
సుమారు రూ.14,165 కోట్ల చెల్లింపులకు ఎన్నికల కమిషన్ అనుమతినివ్వలేదని జగన్ చెప్పారు. ఓ వైపు తెలంగాణలో రైతులకు డబ్బులు చెల్లించేందుకు అనుమతులిచ్చిన ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి కుట్రలు చేసి ఒత్తిడి చేయడంతోనే ఎన్నికల కమిషన్ తమకు అనుమతినివ్వలేదని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి అమలులో ఉన్న సంక్షేమ పథకాల చెల్లింపునకు ఎన్నికల కమిషన్ అనుమతినివ్వకపోవడానికి ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలే కారణమని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే మరో ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ఓటు వేయకుంటే నవరత్నాల పేరుతో ఉన్న సంక్షేమ పథకాలను చంద్రబాబు ఆపేస్తారని జగన్ చెప్పారు. మేనిఫెస్టో విశ్వసనీయతకు అర్థం చెప్పింది వైసీపీ ప్రభుత్వమేనని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో నాడు నేడు ద్వారా మౌలిక వసతుల కల్పించామని, ఇంగ్లిషు మీడియంలో బోధన తీసుకొచ్చామని తెలిపారు. మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. ఇంటివద్దకే పౌర సేవలు అందించేలా ఈ ఐదేళ్ల కాలం పాలించామని చెప్పారు.
చంద్రబాబు తను ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో చెప్పుకోదగ్గ పనులు లేకే ఇతర పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్తున్నారని జగన్ విమర్శించారు. 2014లో రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుదని తెలిపారు. ఏనాడు పేదవారికి సెంటు స్థలం కూడా ఇవ్వని చంద్రబాబు…ఇప్పుడు పేదలకు జగన్ భూములు, ఇళ్లు ఇస్తుంటే ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు.