తెలంగాణ మరో బెంగాల్ కానున్నదా? బీజేపీ టార్గెట్ అదేనా
-తెలంగాణాలో బీజేపీ కు సానుకూలత ఉందా?
-నాయకులూ ఎందుకు క్యూకడుతున్నారు ?
– కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో డి కె అరుణ సుదీర్ఘ భేటీ
-అంతకు ముందు కొండా విశ్వేశ్వర రెడ్డి తో సమావేశం
-అరుణ ఆహ్వానానికి సానుకూల స్పందన
-త్వరలోనే నిర్ణయం చెబుతానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ మరో బెంగాల్ కానున్నదా ? బీజేపీ లక్ష్యం అదేనా ? అసలు బీజేపీకి తెలంగాణాలో సానుకూలత ఉందా ? బెంగాల్ లో బీజేపీ చేసింది ఏమిటి ? అక్కడ టీఎంసీ ని అతలాకుతలం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ప్రధాని ,అమిత్ షా లాంటి పెద్ద నేతలంతా ప్రచారం చేసి మమతా బెనర్జీ ని ఒంటరిని చేసి అనేక ఎత్తులు వేసినప్పటికీ బెంగాల్ లో అధికారంలోకి రాలేక పోయారు. మరి తెలంగాణాలో ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ యస్ బలంగా ఉంది…. అపర రాజకీయ చాణిక్యుడిగా పేరున్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. టీఆర్ యస్ మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తమే అనుకున్న …. బీజేపీ మీద గతంలో కంటే విశ్వాసం ప్రజల్లో సన్నగిల్లింది ….దేశంలో ప్రధాని మోడీ , హోమ్ మంత్రి అమిత్ షా ల పై ప్రజల్లో ఉన్న భ్రమలు తొలిగిపోయాయనే అభిప్రాయాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకు అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. మోడీ ,అమిత్ షా ఎక్కడకు వెళ్లిన విజయాలే అనే భ్రమలు తొలిగిపోయాయి. 2022 లో మరో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఉత్తర ప్రదేశ్ , పంజాబ్ , ఉత్తరాఖండ్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఎదురు గాలి వీచింది. ఇది రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సూచికలుగా పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా బీజేపీ లో కూడా మోడీ షా విధానాల పట్ల అంత సానుకూలంగా లేదనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఆర్ యస్ యస్ పెద్దలకు కూడా మోడీ పాలనా పట్ల అంత సంతృప్తిగా లేరని ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితిలో తెలంగాణాలో 2023 జరిగే ఎన్నికలలో తామే అధికారంలోకి వస్తామని అంటుంది. ఒక రాజకీయపార్టీగా దానికి అవిశ్వాసం ఉండటంలో తప్పులేదు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమిటి ? కేసీఆర్ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ లోకి చేరేందుకు సిద్ధమైయ్యారు. ఇప్పటికే ఆయన టీఆర్ యస్ కు రాజీనామా చేశారు. రేపు మాపో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నారు . ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడిని కలిసి బీజేపీలో చేరేందుకు తన సమ్మతిని తెలిపారు. ఆయనతో పాటు మరికొందరు బీజేపీ లో చేరనున్నారు. ఈటల బీజేపీ లో చేరిక పై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. ఈటల చేరికతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత శక్తి కలిగి ఉందా ? మరి కొంతమంది ముఖ్యనాయకులు కూడా బీజేపీలో చేరనున్నారని ప్రచారం ఎప్పటినుంచో జరుగుతున్నది . కొండా విశ్వేశ్వర రెడ్డి ,కోమటి రాజగోపాల్ రెడ్డి కూడా చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
అసమ్మతి నేతలకు డి కె అరుణ గాలం
తెలంగాణ బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యనాయకులు కలిసి బీజేపీ లో చేరమని ఆమె కోరుతున్నారు. అందుకు ఆమె తన కార్యకలాపాల స్పీడ్ పెంచారు. పార్టీని మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో ఇటీవల సమావేశమైన అరుణ.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. తాజాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో దాదాపు నాలుగు గంటలపాటు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయనను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. అరుణ ఆహ్వానానికి కోమటిరెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారని సమాచారం. కాగా, రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు ఖాయమని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అరుణతో రాజగోపాల్‌రెడ్డి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకరిద్దరు నాయకులు చేరితే బీజేపీకి బలం కొంత పెరిగిన అధికారంలోకి వచ్చేంత పెరుగుతుందా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు ముందు తెలంగాణ రాజకీయాలలో ఏమిజరుగుతుందో చూడాలి మరి !