వైష్ణోదేవి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు!
-క్యాష్ కౌంటర్‌లో చెలరేగిన మంటలు
-షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
-దర్శనాలకు ఆటంకం కలగలేదన్న ఆలయ అధికారులు
జమ్మూకశ్మీర్‌లోని రీసి జిల్లాలో కొలువైన వైష్ణోదేవి ఆలయంలో నిన్న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో క్యాష్ కౌంటర్ కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న భక్తులు భయబ్రాంతులకు గురైయ్యారు. మంటలు పెద్దగా రావడంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది దీనిపై జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు ఆరా తీశారు. కేంద్రం కూడా నివేదిక కోరినట్లు సమాచారం .
నిన్న సాయంత్రం 4.15 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 గంటలకల్లా మంటలను అదుపు చేయడంతో పెను ముప్పు తప్పింది. ప్రమాదం కారణంగా దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఆలయ బోర్డు సీఈవో తెలిపారు. ప్రమాదంలో కొంత నగదు, రికార్డులు కాలిపోయినట్టు పేర్కొన్నారు.