అమెరికాలో టిక్‌టాక్, వీచాట్ డౌన్‌లోడ్ల నిలిపివేత ఉత్తర్వుల ఉపసంహరణ!
ట్రంప్ ఉత్తర్వుల్ని ఉపసంహరించనున్న బైడెన్
భద్రతా సమస్యలపై సమీక్షకు ఆదేశం
దేశ భద్రతకు ముప్పంటూ వీటిపై ట్రంప్ కొరడా
కోర్టుల జోక్యంతో అమల్లోకి రాని నిషేధం
చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్, వీచాట్‌ల కొత్త డౌన్‌లోడ్‌లను నిషేధిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ యంత్రాంగం ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. అలాగే వీటి వల్ల ఎదురయ్యే భద్రతా సమస్యలపై నూతన వాణిజ్య శాఖ సమీక్షించాలని బైడెన్ ఆదేశించినట్లు వైట్‌హౌస్ బుధవారం తెలిపింది.దీంతో టిక్ టాక్ ,వి చాట్ కు ఉన్న అడ్డంకులు తొలగబోతున్నాయి. అమెరికాలో ట్రంప్ నిర్ణయాలను కోర్టులు సైతం తప్పు పట్టాయి.
దేశ భద్రతకు ఈ యాప్‌లు ముప్పు కలిగిస్తున్నాయని పేర్కొంటూ ట్రంప్ వీటి కొత్త డౌన్‌లోడ్‌లను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాతి కాలంలో వీటిని పూర్తిగా నిషేధిస్తామని తెలిపారు. కానీ, కోర్టులు జోక్యం చేసుకొని ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో నిషేధం అమల్లోకి రాలేదు. తాజాగా కొత్త డౌన్‌లోడ్‌లపై ఉన్న నిలిపివేతను సైతం బైడెన్ తొలగించేందుకు సిద్ధమయ్యారు.