- హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ఆదివారం రాత్రి ముత్తంగి వద్ద ఘటన
- ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చి బాలుడిని ఢీకొన్న కారు టైరు
- తీవ్రగాయాల పాలైన చిన్నారి ఆసుపత్రికి తరలింపు
- చికిత్స పొందుతూ గురువారం బాలుడి కన్నుమూత
హైదరాబాద్ శివారులో ఆదివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ముత్తంగి వద్ద ఔటర్ రింగురోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న బాలుడిని దొర్లుకుంటూ వచ్చిన కారు టైరు ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడకు చెందిన సందీప్ రెడ్డి స్థానిక దాబాలో భోజనం చేసేందుకు ఆదివారం తన కుటుంబంతో కలిసి కారులో బయలుదేరారు.
మార్గమధ్యంలో ఆయన కుమారుడు మోక్షిత్ రెడ్డి (6) మూత్రవిసర్జన కోసం కారు దిగాడు. అతడు ఓఆర్ఆర్ పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన కారు టైరు బాలుడిని ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన చిన్నారిని అతడి తల్లిదండ్రులు వెంటనే ముత్తంగిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం, మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాలుడు చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. ఓఆర్‌ఆర్‌పై ఏదైనా కారు టైరు ఊడిపోయి వేగంగా వచ్చి బాలుడిని ఢీకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.