Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

మోడల్‌ రాష్ట్రంలో ఆకలికేకలు…

మోడల్‌ రాష్ట్రంలో ఆకలికేకలు

– గుజరాత్‌లో గర్భిణుల్లో రక్తహీనత..చిన్నారుల్లో పోషక లోపాలు
– నిటి ఆయోగ్‌ నివేదిక

అహ్మదాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోడీ ఇలాకా గుజరాత్‌ ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రమే అయినప్పటికీ ఆకలితో అలమటిస్తోందని నిటి ఆయోగ్‌ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఆకలిలో పోరాడే విషయంలోనూ, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలోనూ ఆ రాష్ట్రం వెనుకబడి ఉన్నదని ఈ నెల ప్రారంభంలో నిటి ఆయోగ్‌ విడుదల చేసిన 2023-24 సంవత్సరపు సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్డీజీ) నివేదిక తెలిపింది. దీని ప్రకారం ఆకలికి సంబంధించిన సూచికలో గుజరాత్‌ 25వ స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారుల్లో 39.7 శాతం మంది పోషకాహార లోపం కారణంగా తక్కువ బరువుతో బాధపడుతున్నారు. ఆకలితో ఎవరూ అలమటించకూడదని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2015లో ఐరాస మొత్తం 17 లక్ష్యాలను పెట్టుకుంది. అయితే ఆకలికి సంబంధించిన సూచికలో గుజరాత్‌ కేవలం 41 పాయింట్లు మాత్రమే సాధించింది.

ఆకలితో పోరాడే విషయంలో ఒడిషా, మధ్యప్రదేశ్‌, మరో 23 రాష్ట్రాల కంటే వెనుకబడి పోయింది. ఆకలి సూచికలో గుజరాత్‌ 2020-21లో 46 పాయింట్లు సాధించగా 2019-20లో 41 పాయింట్లు పొందింది. 2018లో 49 పాయింట్లు సాధించింది. ఆకలిపై పోరు విషయంలో గుజరాత్‌ బాగా వెనుకబడి పోతోందని దీనిని బట్టి అర్థమవుతోంది. ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లల్లో 39 శాతం మంది కుంగుబాటుకు గురవుతున్నారని, 15-49 సంవత్సరాల మధ్య వయసున్న గర్భిణుల్లో 62.5 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, అదే వయసున్న మహిళల్లో 25.2 శాతం మందిలో బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) 18.5 కంటే తక్కువగా ఉన్నదని నిటి ఆయోగ్‌ నివేదిక చెబుతోంది. 2018, 2019తో పోలిస్తే కుంగుబాటుకు గురవుతున్న పిల్లలు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగింది.

‘గుజరాత్‌కు సంబంధించిన ఆకలి సూచిక 2020-21లో 46 పాయింట్లు ఉంటే 2023-24లో 41 పాయింట్లకు పడిపోయింది. ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో 39.7 శాతం మంది తక్కువ బరువుతో బాధపడుతున్నారు. గర్భిణుల్లో 62.5 శాతం మంది రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2030 నాటికి ఆకలిని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే విషయంపై తక్షణమే దృష్టి సారించాలి. అందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టాలి’ అని అహ్మదాబాద్‌కు చెందిన విద్యావేత్త ఆత్మన్‌ షా సూచించారు. 2023వ సంవత్సరానికి సంబంధించి దేశంలో పేదరికంపై నిటి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభాలో దాదాపు సగం మందికి (44.45 శాతం), పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో 28.97 శాతం మందికి పోషకాహారం లభించడం లేదు.

Related posts

రాహుల్ గాంధీ శిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు జడ్జి బదిలీ

Ram Narayana

ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదు: హర్యానాలో ఒక్క సీటూ రాకపోవడంపై కేజ్రీవాల్

Ram Narayana

ఫడ్నవీస్ కాకుండా… మహారాష్ట్ర సీఎం పదవి కోసం తెరపైకి మురళీధర్ మోహల్ పేరు!

Ram Narayana

Leave a Comment