అమిత్ షా, నడ్డాతో మోదీ సుదీర్ఘసమావేశం
-మంత్రివర్గంలో భారీ మార్పులంటూ ఊహాగానాలు!
-గురువారం నుంచి సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్న మోదీ
-నేడూ కొనసాగిన సమావేశాలు
-వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్ష
-దీని ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు
-ఓ భారీ పథకాన్ని ప్రకటించే అవకాశం
-పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలు
ప్రధాని నరేంద్రమోడీ తీరికలేకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక పక్క మంత్రులతో సమావేశం అవుతూ మరో పక్క రాష్ట్రాలలో పార్టీలో నెలకొన్న అసంతృప్తులను చక్కదిద్దే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన హోమ్ మంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షులు జె పి నడ్డాతో సుదీర్ఘంగా సమావేశం కావడంతో వివిధ రాష్ట్రాలలో పార్టీ పరిస్తితితోపాటు , కేంద్ర మంత్రి వర్గం విస్తరణపై చేర్చించినట్లు ఊహాగానాలు బయలు దేరాయి…
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నుంచి వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుని సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం కూడా పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయా మంత్రుల పనితీరును అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో మోదీ శుక్రవారం భేటీ అయ్యారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న వార్తలు జోరందుకున్నాయి. ఆయా మంత్రుల పనితీరును బట్టి మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
మరోవైపు వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ భారీ సామాజిక పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న దాదాపు ఐదు గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మోదీ.. ఏప్రిల్-మే నెలల్లో కొవిడ్ నియంత్రణపై ఆయా మంత్రిత్వ శాఖల పనితీరు ఎలా ఉందో సమీక్షించినట్లు సమాచారం. మరోవైపు ఏటా నిర్వహించే సాధారణ సమీక్షేనని మరికొందరు అభిప్రాయపడ్డారు.