Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

శ్వాసై సాగిన మున్నేరే … తీరని శోకాన్ని మిగిల్చింది

ఖమ్మం నగరాన్ని అనుకొని వున్న మున్నేరు ప్రజల ఎన్నో అవసరాలు తీర్చింది. ముఖ్యంగా తాగు నీరు అందించి, ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చింది. ఇంకా తీరుస్తూనే వుంది. బట్టలు ఉతకాలన్నా … సంధ్యా వందనం చేయాలన్నా … పిల్లలు ఈత కొట్టాలన్నా … సరదాగా స్నానం చేయాలన్నా … చివరకు పవిత్ర జలం కావాలన్నా … మున్నేరే కేరాఫ్ అడ్రస్ గా మారింది. కానీ, అది మొన్నటి మాట. నేడు అది దుఃఖ సాగరంగా మారింది. వేలాది మంది బ్రతుకులను చిన్నా భిన్నం చేసింది. గతంలో అనేక సార్లు వరదలు వచ్చినప్పటికీ ఇంతటి విపత్తు జరగ లేదు. వంద సంవత్సరాల చరిత్రలోనే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో 42 సెం. మీ వర్షపాతం నమోదైన దాఖలాలు లేవు. భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి ఒక్కసారిగా వచ్చిన వరదలు ఖమ్మం నగరాన్ని ముంచెత్తాయి. ఇళ్లపై పడి కాలనీలను కమ్మేయడంతో ప్రజలు దిక్కు తోచక పరుగులు తీశారు. ఖమ్మంలో మున్నేరుపై మూడు బ్రిడ్జిలుండగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి పై నుంచి వరద ప్రవహించింది. బ్రిడ్జి పై చిక్కుకున్న 9 మందిని బయటకు తీసుకొచ్చేందుకు 14 గంటల సమయం పట్టింది. చివరకు పక్కనే వున్న వెంకట గిరి గ్రామస్తులు దైర్యం చేసి, బ్రిడ్జిపైకి జేసీబీ సహాయంతో వెళ్లి వరద నీటిలో చిక్కున్న వాళ్లను తీసుకొచ్చారు. అప్పటి వరకూ అధికార యంత్రాంగానికి తెలిసినా … స్పందించిన తీరు సరిగా లేకపోవడంతో విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మంత్రులు పరుగులు తీస్తున్నారు … సీఎం వచ్చి వెళ్లారు … ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితుల పరామర్శ పేరుతో బురద రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలు, కాలనీల ప్రజలు ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూ స్తున్నారు. వరద బీభత్సంతో కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, తీర్థాల, రామన్నపేట, దానవాయిగూడెం, కామంచి కల్లు, హస్నా తండా, వాల్యా తండా, జలగం నగర్, నాయుడు పేట, పెద్ద తండ, కేబీఆర్ నగర్, శ్రీ రామ్ నగర్ లోని అన్ని ఇళ్ళూ మునిగి పోయాయి. పదుల సంఖ్యలో ఇళ్ళు నేల మట్టమయ్యాయి. వందలాది ఇళ్ళు దెబ్బతిన్నాయి. రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలు ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంలో అనేక డివిజన్లలో గృహాలను ముంచెత్తాయి. ఒక్కసారిగా వరదలు రావడంతో చేసేది లేక ఇళ్లను వదిలి పెట్టి పోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అకస్మాత్తుగా వచ్చిన వరదలు మున్నేరు ప్రాంత ప్రజలను దుఃఖ సాగరంలో ముంచాయి. కట్టు బట్టలతో బయటకు వచ్చిన ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రక్కనే వున్న కరుణగిరి లో కొందరు తలదాచుకున్నారు. మరి కొందరు సహాయక కేంద్రాలకు వెళ్లారు. ఇంట్లో దాచుకున్న సామాన్లన్నీ వరద పాలయ్యాయి. కట్టు బట్టలతో బయట పడ్డ వరద బాధితుల ఇప్పటికీ భయం భయంగానే కాలం వెళ్ళదీస్తున్నారు. అనేక ఇళ్ళు నేల మట్టమైయ్యాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, వందల ఇండ్లలో ఇసుక మేటలేశాయి. ఇళ్ళన్నీ బురదమయం అయ్యాయి. బురద తీసేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పైగా స్తంభాలు వరద దాటికి కొట్టుకుపోవటంతో విద్యుత్ లేక చిమ్మ చీకట్లో బాధితులు బిక్కు బిక్కుమంటున్నారు. తేళ్లు, పాములు తిరుగుతున్నాయి. పరిస్థితి ఆగమ్య గోచరంగా మారడంతో ప్రస్తుతం పుట్టెడు దుఃఖంతో మున్నేరు వరద భాదితులు ఉన్నారు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. సహాయం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కొన్ని ముందుకు వచ్చినా, వారికి జరిగిన నష్టాన్ని పూడ్చడం ఇప్పట్లో అయ్యే పని కాదు. వారి బాధ, హృదయ విధారక దృశ్యాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఒకే సారి 42 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కావటం మున్నేరు చరిత్రలో ఒక రికార్డు. ఇంత వర్షపాతం నమోదవుతుందని చివరికి వాతావరణ శాఖ కూడా ఊహించ లేదు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు తమ ఇళ్ళలో ప్రశాంతంగా వున్న సమయంలో ఒక్కసారిగా వాయు వేగంగా వచ్చిన వరదలు ఇళ్లను చుట్టు ముట్టడంతో బ్రతుకు జీవుడా అంటూ … సర్వం వదిలేసి ప్రజలు పరుగులు తీశారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకు పోయాయి. బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ వరదల్లో కొట్టుకు పోవడంతో తినటానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక వండుకోవడానికి పొయ్యి లేక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఈ నేపధ్యంలో ప్రభుత్వం నుండి అంతగా సహాయం అందడం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వుంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పోయిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు కనిపించింది. అయినప్పటికీ సహాయ కార్యక్రమాలు జరగాల్సినంత వేగంగా జరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన కరెంటును పునరుద్దరించేందుకు మాత్రం ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. ఇప్పటికైనా … తక్షణమే తెగి పోయిన రోడ్లుకు మరమత్తులు, విద్యుత్ స్తంభాలు, లైన్ల పునరుద్ధరణ, త్రాగు నీటి సౌకర్యం, చెరువుల గండ్లు పూడ్చడం, పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యతనిచ్చి అధికార యంత్రాంగం పనిచేయాల్సిన అవసరం ఉంది.

అసలే వానాకాలం డెంగ్యూతో రాష్ట్రం జ్వరాన పడ్డది…దీనికి తోడు వరదలు ఇళ్లలోకి చొరబడటంతో కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉంది …దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం కావాల్సి ఉంది ..లేకపోతె ప్రజలు రోగాల బారిన పడతారు …వరదలో కొట్టుకొని పోయిన పిల్లల పుస్తకాలూ , సర్టిఫికెట్స్ , ఇతర డాక్యుమెంట్స్ ప్రభుత్వమే పైసా ఖర్చు లేకుండా భాదితులకు అందేలా చేర్యతీసుకోవానే డిమాండ్ వస్తుంది …జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు …ఎన్యుమరేషన్ సరిగా జరగాలి …పంటలు నష్టపోయిన రైతులకు విత్తనాలు, ఎవరువులు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు రైతులు రైతు సంఘాల కోరుతున్నాయి…

Related posts

న్యూస్ ఇన్ బ్రీఫ్ ……

Drukpadam

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం ఉరుకులు పరుగులు ….

Ram Narayana

ఎన్నికల తర్వాత సైకోలకోసం ఖమ్మంలో పిచ్చి ఆసుపత్రి ..మంత్రి పువ్వాడ హాట్ కామెంట్స్ !

Ram Narayana

Leave a Comment