- శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వార్తలపై రాహుల్ గాంధీ ఆందోళన
- ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు వెంకటేశ్వరస్వామి ఆరాధ్య దైవమన్న రాహుల్
- లడ్డూ విషయం ప్రతి ఒక్క భక్తుడినీ బాధపెడుతోందని వ్యాఖ్య
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదంపై లోక్ సభలో ప్రతిక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారనే వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయని పేర్కొన్నారు. బాలాజీ మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమని రాసుకొచ్చారు. లడ్డూ కల్తీ జరిగిందనే విషయం ప్రతి భక్తుడినీ బాధపెడుతోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో అధికారులు మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాలని సూచించారు.
జగన్ హయాంలో ఆలయాలను ధ్వంసం చేశారు: బీజేపీ
బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవధర్ కూడా తిరుపతి లడ్డూ అంశంపై స్పందించారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏపీలో బస్సు టిక్కెట్లపై జెరూసలేంను ప్రమోట్ చేశారని, హిందూ ఆలయాలను ధ్వంసం చేశారని, హిందూ గుళ్లలో క్రైస్తవ ఉద్యోగులను పెట్టారని, ట్యాక్స్ పేయర్స్ డబ్బులను చర్చీల కార్యకలాపాల కోసం ఉపయోగించాడని ఆరోపించారు.