సీరం అధినేతకు భద్రత పెంచాలన్న పిటిషనర్.. బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
-పూనావాలాకు ప్రస్తుతం వై కేటగిరీ భద్రత
-జడ్ ప్లస్ కు పెంచాలని కోరిన న్యాయవాది దత్తా మానే
-బాంబే హైకోర్టులో పిల్
-అది పూనావాలా వ్యక్తిగత వ్యవహారం అన్న కోర్టు
కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలాకు భద్రత కల్పించే విషయమై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. పూనావాలకు కేంద్రం ప్రస్తుతం వై కేటగిరీ భద్రత అందిస్తోంది. అయితే, వ్యాక్సిన్ సరఫరాపై అదర్ పూనావాలపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని, ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని దత్తా మానే అని అడ్వొకేట్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
“మీరు ఎవరికి భద్రత కల్పించాలని కోరుతున్నారో, ఆ వ్యక్తికి కనీసం మీరు పిటిషన్ వేసిన విషయం తెలుసా?” అని ధర్మాసనం పిటిషనర్ ను ప్రశ్నించింది. “అతడు తనకు ఎలాంటి భద్రత అక్కర్లేదని అంటే ఏంచేయాలి? కోర్టులు ఎప్పుడూ వ్యక్తుల వెంట పరుగులు తీయవు” అని ద్విసభ్య ధర్మాసనం హితవు పలికింది.
ఈ క్రమంలో, పూనావాలా కోరితే తగిన భద్రత కల్పించేందుకు తాము సిద్ధమని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే, కోర్టు ఈ పిటిషన్ పై విచారణను ఇంతటితో ముగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆ పిల్ ను మూసేస్తున్నట్టు తెలిపింది. భద్రతకు సంబంధించినంత వరకు అది పూనావాలా వ్యక్తిగత వ్యవహారం అని స్పష్టం చేసింది.