Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సుప్రీం కోర్ట్ వార్తలు

భారత్ సెక్యులర్‌గా ఉండాలనుకోవట్లేదా?: సుప్రీంకోర్టు

నవంబర్ 26వ తేదీన 1949లో కన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీ.. భారత రాజ్యాంగాన్ని స్వీకరించినప్పుడు పీఠికలో ఈ రెండు పదాలు లేవని, ఎమర్జెన్సీ కాలంలో(1976) ఈ రెండు పదాలను పార్లమెంటులో చర్చ పెట్టకుండానే చేర్చారని పిటిషనర్లు పేర్కొన్నారు. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌ల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తూ.. భారత దేశం సెక్యులర్ దేశంగా ఉండకూడదని మీరు అనుకుంటున్నారా? అని సూటిగా ప్రశ్నించింది. లౌకిక భావన సవరించలేని.. రాజ్యాంగంలో అంతర్భాగమైన భావన అని వివరించింది. కోర్టు వెలువరించిన ఎన్నో తీర్పుల్లో అంతర్లీనంగా ఈ భావన ఉంటుందని తెలిపింది. అందరికీ స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే పదాలు, పార్ట్ 3లోని హక్కులను పరిశీలిస్తే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో లౌకికత్వం ఉన్నదని స్పష్టమవుతుందని తెలిపింది. భారత రాజ్యాంగ పీఠికలో అదనంగా చేర్చిన లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలని, పీఠికను సవరించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణియన్, బలరాం సింగ్, అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్‌లు ప్రజా ప్రయోజన వ్యాఖ్యాల(పిల్)ను దాఖలు చేశారు.

ఈ పిటిషన్లు విచారిస్తూ.. సుప్రీంకోర్టు వెలువరించిన అనేక తీర్పుల్లో సెక్యులరిజం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని పేర్కొన్నదని, దీన్ని సవరించలేని స్థాయిని ఇచ్చిందని ధర్మాసనం వివరించింది. ఈ రెండు పదాల అర్థాలను వేర్వేరు కోణాల్లో చర్చించవచ్చునని పేర్కొంటూ.. ఈ పదాలు రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని సూచిస్తాయని స్పష్టం చేసినట్టు తెలిపింది. సెక్యులరిజంపై చర్చ జరిగేటప్పుడు ఫ్రెంచ్ మాడల్ మాత్రమే ఉన్నదని పేర్కొంది. లౌకికత్వానికి వ్యతిరేకంగా వెళ్లిన నిర్ణయాలను కోర్టు రద్దు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపింది. అవసరమైతే ఆర్టికల్ 25ను ఓ సారి చూడాలని సూచించింది. ఇక సోషలిజం విషయానికి వస్తే దీన్ని వెస్ట్రన్ కాన్సెప్ట్‌గా చూడలేదని, ఆచరించలేదని స్పష్టం చేసింది. సామ్యవాదాన్ని చేరిస్తే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారని అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ వాదించగా.. ‘మరి ఆ స్వేచ్ఛను కాలరాశారా? చెప్పండి?’ అంటూ జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు. సోషలిస్టు అనే పదాన్ని పాశ్చత్య దృష్టితో చూడొద్దని ధర్మాసనం సూచించింది. సామ్యవాదం అంటే అందరికీ సమాన హక్కులు కల్పించాలని, దేశ సంపదను సమానంగా పంపిణీ చేయాలి అనే అర్థంలో కూడా చూడొచ్చు కదా అని చెప్పింది.

ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు ఈ సవరణ తెచ్చారని పేర్కొంటూ ‘నేను ఎక్కువ చర్చించదలుచుకోలేదు. జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా ఆ పని చేసి మనల్నందరికీ రక్షించారు’ అని అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ అన్నారు. 1976లో సుప్రీంకోర్టు వెలువరించిన ఓ తీర్పును ఆయన పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం ఒక పౌరుడిని అక్రమంగా అరెస్టు చేయరాదనే హక్కును సస్పెండ్ చేయవచ్చని 4-1 వెలువడ్డ తీర్పులో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా అసమ్మతి తెలిపారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు మేనల్లుడు.

ఈ వాదనపై జస్టిస్ ఖన్నా స్పందిస్తూ.. ‘భారత్ సెక్యులర్‌గా ఉండాలని మీరు కోరుకోవట్లేదా?’ అని ప్రశ్నించారు. ‘భారత్ లౌకిక దేశం కాదని అనడం లేదు. మేం ఆ సవరణను మాత్రమే సవాల్ చేస్తున్నాం’ అని జైన్ సమాధానమిచ్చారు. అడ్వకేట్ ఉపాధ్యాయ్ వాదనలు వినిపిస్తూ.. పీఠికలోని ఈ రెండు పదాలు కొత్త చిక్కులను తెచ్చిందన్నారు. ‘మనం ఎల్లప్పుడూ లౌకికంగానే ఉన్నాం. కానీ, వీటిని పీఠికలో చేర్చడం మూలంగా కొత్త సమస్యలు తెరమీదికి వచ్చాయి. రేపు ప్రజాస్వామ్యం అనే పదాన్నే పీఠికలో నుంచి తొలగించేయవచ్చు.’ అని వాదించారు. ‘ఈ పదాలను చేర్చేటప్పుడు ప్రజామోదం లేదు’ అని ప్రస్తావించగా.. ‘ఆ సమయంలో మరెన్నో ఇతర శాసనాలను కూడా ఆమోదించి ఉండవచ్చు కదా! వాటి పరిస్థితి ఏమిటీ?’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇక బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి వాదిస్తూ.. ‘ఇది ఎలా తప్పో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ చేర్పు మరో చోట ఉండటం మంచిది. పీఠికను మనం రెండు భాగాలుగా చేసుకోవచ్చు. 1949లోనే సెక్యులరిజం, సోషలిస్టు అనే పదాలు చేర్చినట్టుగా పీఠికను చదవాల్సి ఉంటుంది. కాబట్టి, పీఠికలో ఒక భాగాన్ని తేదీతో, మరో భాగాన్ని తేదీ లేకుండా చేసుకోవచ్చు’ అని తెలిపారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పిస్తే పరిశీలిస్తామని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు. నోటీసులు జారీ చేయడానికి నిరాకరించిన ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.

Related posts

భూమి మనిషికి చెందదు.. అడవులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిందే: సుప్రీంకోర్టు

Ram Narayana

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్ష‌లు…

Ram Narayana

ఆత్మహత్య అని ఎలా చెప్పారు?.. కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై సుప్రీంకోర్టు

Ram Narayana

Leave a Comment