కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణం జరిగితే సిబ్బందిపై కఠిన చర్యలు ..జిల్లా కలెక్టర్ !
ఇప్పటివరకు జరిగిన అక్రమ నిర్మాణాలను గుర్తించండి
నిర్మాణాలు ఏస్థాయిలో ఉన్నాయో నివేదిక ఇవ్వండి
నగరపాలక సంస్థ అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలి…
శాస్త్రీయ విధానం ప్రకారం డివిజన్లకు పారిశుద్ధ్య సిబ్బంది కేటాయింపు
కార్పోరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలను గుర్తించాలి
కార్పోరేషన్ లో కొత్తగా ఒక అక్రమ నిర్మాణం జరిగినా సహించేది లేదు .
పన్ను వసూళ్ల అసెస్మెంట్ పునఃపరిశీలన చేయాలి
మున్సిపల్ కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగితే దానికి కార్పొరేషన్ సిబ్బందే భాద్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు …గురువారం ఖమ్మం కార్పొరేషన్ పై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు పారిశుద్యం ,డివిజన్ల వారీగా పారిశుధ్య సిబ్బంది కేటాయంపు , పన్నుల అస్సెస్స్ మెంట్ పునః పరిశీలన పై కలెక్టర్ కార్పొరేషన్ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు .. ఈసమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ విధానం, ఖాళీ స్థలాలు, డ్రైయిన్ల మరమ్మత్తు పనుల గుర్తింపు, పారిశుధ్య కార్మికుల హాజరు, అక్రమ నిర్మాణాల సర్వే, వాణిజ్య భవనాల పన్ను అసెస్మెంట్, పన్ను వసూలు వంటి పలు అంశాలపై కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్ సమీక్షిస్తూ నగరంలో డివిజన్ వారీగా కేటాయించిన పారిశుధ్య సిబ్బంది, ఎక్కువగా పారిశుధ్య ఇబ్బందులు వచ్చే డివిజన్, చెత్త తరలింపు చర్యలు మొదలగు వివరాలను తెలుసుకున్నారు. నగరంలో చాలా వరకు పారిశుధ్య సిబ్బంది లెక్కలు తప్పుగా నమోదవుతున్నాయని, క్షేత్ర స్థాయిలో పద్దతి మార్చుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి డివిజన్ కు కేటాయించిన పారిశుధ్య సిబ్బంది క్షేత్ర స్థాయి తనీఖీ సమయంలో తప్పనిసరిగా ఉండాలని, వారి హాజరు 95 శాతం పైగా ఉండాలని కలెక్టర్ అన్నారు.
పారిశుధ్య సిబ్బంది కేటాయింపు ప్రతి డివిజన్ కు ఒకే విధానంలో కాకుండా శాస్త్రీయ పద్దతిలో చేయాలని అన్నారు. డివిజన్ ప్రతి ష్ట్రెచ్ కు పారిశుధ్య సిబ్బంది విధులను పక్కాగా కేటాయించాలని, పారిశుధ్య ప్రణాళిక పకడ్బందీగా జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఇంటికి చెత్త బండి ఎప్పుడు వస్తుంది అనే షెడ్యూల్ తయారు చేయాలని, పారిశుధ్య సమస్యల కోసం సంప్రదించేందుకు మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ తో ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సానుకూలంగా, మర్యాదతో స్పందించే విధంగా అధికారులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
డివిజన్ లో ఎటువంటి చెత్త వస్తుంది గమనించి నెల రోజులలో పారిశుధ్య ప్రొఫైల్ ప్రతి డివిజన్ కు తయారు చేయాలని అన్నారు. నగరం నగరపాలక సంస్థ పరిధిలో జ్యూస్ షాపులు, హోటల్స్, నాన్ వెజ్ దుకాణాలు, ఫంక్షన్ హాల్స్ మొదలగు వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడి నుంచి ఎటువంటి చెత్త వస్తుంది, రోడ్డుపైన ఆ చెత్త పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి డివిజన్ లో అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాలను, హాట్ స్పాట్ లకు జియో ట్యాగ్ చేయాలని, ప్రతి నెలా కార్పొరేషన్ పరిధిలో 20 హాట్ స్పాట్ లను పూర్తి స్థాయిలో శుభ్రం చేసి, అక్కడ ముందు ఎలా ఉంది, తరువాత ఎలా ఉందో ఫోటోలు పెట్టాలని కలెక్టర్ తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేషన్ పై విస్తృతంగా ప్రచారం కల్పించి, ప్రజల్లో అవగాహన తేవాలని, నిబంధనల మేరకు ప్లాస్టిక్ బ్యాన్ అమలు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని అన్నారు.
పారిశుధ్య సిబ్బందికి అవసరమైన పరికరాలు అందించాలని, వారి హెల్త్ ఫ్రోఫైల్ రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పారిశుధ్య సిబ్బంది, ప్రతి ఒక్కరు ప్రణాళిక ప్రకారం పని చేస్తే పారిశుధ్య నిర్వహణ మెరుగవు తుందని అన్నారు.
టౌన్ ప్లానింగ్ విభాగంపై కలెక్టర్ సమీక్షిస్తూ, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల సర్వే చేపట్టాలని, పునాదుల దశ, స్లాబ్ దశ, నిర్మాణం పూర్తయిన అక్రమ నిర్మాణాల వివరాలు సేకరించాలని కలెక్టర్ తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, అక్కడ అక్రమ నిర్మాణాలు తొలగించినట్లు డిస్ప్లే చేయాలని కలెక్టర్ సూచించారు.
కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు, కాంట్రాక్టర్లను గుర్తించి వారిని బ్లాక్ లిస్ట్ చేయాలని, ప్రభుత్వ నిర్మాణ పనులకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు చేయవద్దని అన్నారు. రోడ్డు, ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపుకు ప్రణాళిక రూపొందించుకోవాలని, ముందుగా నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం నగర వ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీ, హొర్డింగ్ బోర్డుల ముద్రణ వ్యాపారులకు కార్పొరేషన్ అనుమతి లేకుండా ఎక్కడ బహిరంగ ప్రదేశాలలో ఫ్లెక్సీలు ప్రదర్శించడానికి వీలులేదని స్పష్టమైన ఆదేశాలు అందించాలని కలెక్టర్ తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగం మానవత్వంతో పని చేయాలని, ఎక్కడ నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి కూల్చివేతలకు పాల్పడవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.
అక్రమ నిర్మాణాల గుర్తింపు విషయంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడవద్దని అన్నారు. అక్రమ భారీ నిర్మాణాలు నిర్మించే సమయంలో ఆపకుండా ఏం చేస్తున్నారని అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేషన్ పరిధిలో మరో అక్రమ కట్టడం జరిగితే సిబ్బంది పట్ల అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని, ఎటువంటి ఒత్తిడులకు లొంగవద్దని అన్నారు.
రెవెన్యూ వసూళ్లపై కలెక్టర్ సమీక్షిస్తూ అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీలపై భారీగా ఫైన్ విధించాలని కలెక్టర్ తెలిపారు. కార్పోరేషన్ పరిధిలో వసూళ్లు చేస్తున్న ఆస్తి పన్ను విలువ అసెస్మెంట్ పునఃపరిశీలన చేయాలని కలెక్టర్ సూచించారు.
కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటి సరఫరా బిల్లులను ఎప్పటికప్పుడు వసూలు చేయాలని, త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేయకపోతే తీసుకునే చర్యలను వివరించాలని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ షఫీఉల్లా, మునిసిపల్ ఇఇ క్రిష్ణలాల్, ఏ.సి.పి. వసుంధర, పర్యవేక్షకులు విజయానంద్, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, రెవెన్యూ అధికారి జి. శ్రీనివాస రావు, సి సెక్షన్ పర్యవేక్షకులు కె. శ్రీనివాస రావు, బిల్డింగ్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు, ఇంజినీరింగ్, అకౌంట్స్, మెప్మా అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.