- ఈ మెయిల్‌లో బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు
- తిరుపతి హోటల్స్‌లో ప్రత్యేక బృందాలతో పోలీసుల విస్తృత తనిఖీలు
- ఎక్కడా పేలుడు పదార్ధాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
- బెదిరింపు ఈ-మెయిల్స్‌పై పోలీస్ స్టేషన్ లో కేసుల నమోదు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. లీలామహాల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా పేలుడు పదార్ధాలు లేవని నిర్ధారణ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్‌పై అలిపిరి, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విషయంలోకి వెళితే.. తమిళనాడులో ఒక కేసులో ఉగ్రవాది జాఫర్ సాదిక్‌కు కోర్టులో జైలు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో సీఎం కుటుంబంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్ఐ పూనుకుందని, తమిళనాడుకు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం తిరుపతిలో పలు హోటళ్లను కూడా పేల్చేస్తాం అంటూ మెయిల్స్ ద్వారా హెచ్చరికలు వచ్చాయి. హోటళ్ల యజమానులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
మరో వైపు.. తిరుపతి విమానాశ్రయంలోని స్టార్ ఎయిర్ లైన్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. స్టార్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎస్ 5 – 154 ఫ్లైట్‌కు సోషల్ మీడియాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. అదామ్ నాన్‌జా 333 పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలు విమాన సర్వీసులకు ఫేక్ బాంబు బెదిరింపులు రావడం అధికార యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఫేక్ బెదిరింపు కాల్స్‌తో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.