ఏపీ లో నిరసన కార్యక్రమాలకు టీడీపీ పిలుపు
-ఈనెల 16 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
-ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో నిర్ణయం
-16న తహసీల్దార్ కార్యాలయాల్లో నిరసన
-కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం కోసం డిమాండ్
ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి ఈ నెల 22 వరకు ‘నిరసన వారం’ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యనేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నిన్న నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణను కూడా ఖరారు చేశారు. కరోనా కారణంగా దెబ్బతిన్న వృత్తి, వ్యాపారాల్లోని వారిని ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాయని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదని టీడీపీ ఆరోపించింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే, వృత్తులు దెబ్బతిన్న వారికి రూ. 10 వేలు అందించాలని, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
నిరసన కార్యక్రమాల్లో భాగంగా రేపు తహసీల్దారు కార్యాలయాల్లో, 18న రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో, 20న కలెక్టర్ కార్యాలయాల్లో పది డిమాండ్లపై వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలుపుతారు. అలాగే, 22న 175 నియోజకవర్గాల్లో దీక్షలు చేస్తారు.