కొత్త అవతారంలో ఈటల హుజురాబాద్ పర్యటన !
-బీజేపీ నేతలతో కలిసి తొలిసారి హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్
-ఇటీవలే బీజేపీలో చేరిన ఈటల
-హుజూరాబాద్‌లో నాలుగు రోజుల పర్యటన
-నాగారం, నగురంలో పలు కార్యక్రమాలు
చాల సంవత్సరాల తరువాత మాజీమంత్రి ఈటల రాజేందర్ తన స్వంత నియోజకవర్గమైన హుజురాబాద్ కు కొత్త అవతారంలో పర్యటిస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వ హంగు ఆర్భాటాలు లేవు…. పోలిసుల హడావుడి అసలే లేదు…. భుజాన గులాబీ కండువా లేదు… ఇప్పుడు కాషాయం కండువా కప్పుకొని కొత్త అవతారంలో దర్శనం ఇస్తున్నారు….
ఇటీవలే బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తొలిసారి హుజూరాబాద్‌కు వెళ్లారు. ఆయన వెంట వివేక్‌తో పాటు ఇతర బీజేపీ నేతలు కూడా ఉన్నారు. అలాగే శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ కూడా ఈటలతో కలిసి హుజురాబాద్ వెళ్లారు. అక్కడ ఆయన నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.
హుజూరాబాద్ పర్యటనకు వచ్చిన ఈటల బృందానికి కాట్రపల్లి వద్ద బీజేపీ కార్యకర్తలు, స్థానికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా నాగారం, నగురంలో ఈటల బృందం పలు కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ నేతలు కూడా ఆ నియోజక వర్గంలో పర్యటనలు ప్రారంభించారు.