Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

సంధ్య థియేటర్ ఘటనపై కమెడియన్ రాహుల్ రామకృష్ణ యూటర్న్..

నిజం తెలిసిందంటూ నాటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న నటుడు!

  • అల్లు అర్జున్ అరెస్ట్‌ విషయంలో పోలీసుల తీరును తప్పుబడుతూ పోస్ట్
  • అప్పట్లో తన వద్ద సరైన సమాచారం లేకే అలా స్పందించానని వివరణ
  • ఆ రోజు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ మరో పోస్ట్
  • రాహుల్ నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసలు

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసుల పనితీరును ప్రశ్నించడంతోపాటు నటుడు అల్లు అర్జున్‌కు అండగా నిలుస్తూ పోస్టు పెట్టిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇప్పుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా అర్థం చేసుకోకుండానే స్పందించానని, ఇప్పుడు నిజం తెలిశాక దానిని వెనక్కి తీసుకుంటున్నానంటూ చేసిన ఆయన పోస్టు వైరల్ అవుతోంది. 

నాటి తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అందరిలానే స్పందించిన రాహుల్ రామకృష్ణ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, లా అండ్ ఆర్డర్ వైఫల్యం కనిపిస్తోందని పేర్కొన్నారు. పబ్లిక్ ప్రదేశాలకు సెలబ్రిటీలు హాజరయ్యేటప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. సినిమా స్థాయిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎక్కుమంది వస్తారని తెలిసినప్పుడు ఆ మేరకు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. అంతమందిని ఒకేసారి లోపలికి ఎందుకు అనుమతించారని నిలదీశారు. రాజకీయ పార్టీల సమావేశాల్లోనూ తొక్కిసలాట జరిగి కొన్నిసార్లు ప్రజలు మరణిస్తారని, అలాంటి వాటికి ఇంత వేగంగా ఎందుకు స్పందించరని, సినిమా విషయంలో ఇంత వేగంగా ఎందుకు స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూడాలని, ఇలాంటి ఘటనల్లో ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదంటూ ఆ రోజు పోలీసుల తీరును రాహుల్ తప్పుబట్టారు.

బన్నీ అరెస్ట్ చిత్ర పరిశ్రమ వర్సెస్ ప్రభుత్వంగా మారి రచ్చకెక్కిన నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై నిన్న పోలీసులు వివరంగా వీడియో రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు ర్యాలీగా రావడం, థియేటర్‌లో కూర్చుని సినిమా చూడడం, ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట.. రేవతి, ఆమె కుమారుడు కిందపడి నలిగిపోవడం, ఆ తర్వాత థియేటర్ నుంచి వెళ్తూ బన్నీ మరోమారు అభిమానులకు అభివాదం చేయడం.. వంటివన్నీ సమయంతో సహా వివరంగా చెబుతూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వీడియో విడుదల చేశారు. 

ఈ నేపథ్యంలో రామకృష్ణ స్పందిస్తూ.. ఆ రోజు అసలు సరిగ్గా ఏం జరిగిందన్న సమాచారం తన వద్ద లేదని, అందుకే అలా స్పందించానని, ఆ రోజు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నానంటూ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టు వైరల్ కావడంతో యూజర్లు స్పందిస్తున్నారు. చాలా మంచి నిర్ణయమని, నిజం వైపు నిలబడటం అన్నింటి కంటే ముఖ్యమంటూ రాహుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Related posts

బిగ్ బీకి కోపం వచ్చింది …కొడుకు కోడలు వీడిపోతున్నారనే వార్తలపై మండిపాటు

Ram Narayana

పుట్టిన రోజున బిగ్‌బీని చూసి అభిమానుల్లో సంబరం

Ram Narayana

మా ఎన్నికలపై భిన్న స్వరాలూ ….మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment