- గాంధీ భవన్‌కు వచ్చిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
- దీపాదాస్ మున్షీని కలిసి వెళ్లిన చంద్రశేఖర్ రెడ్డి
- విషయం తెలిసి ఫోన్ చేసిన టీపీసీసీ చీఫ్
సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి తాను ఫోన్ చేశానని, ఒకట్రెండు రోజుల్లో కూర్చొని మాట్లాడదామని చెప్పానని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత అని, ఆయన తనకు మంచి స్నేహితుడు అన్నారు.
గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీడబ్ల్యుసీ సభ్యుడు కొప్పుల రాజు, దీపాదాస్ మున్షీ ఉన్నారనే సమాచారంతో ఆయన గాంధీ భవన్‌కు వెళ్లారు. చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వెళ్లిన సమయంలో మహేశ్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో ఉన్నారు. దీంతో దీపాదాస్ మున్షీని కలిసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ కుమార్ గౌడ్ ఆయనకు ఫోన్ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు తాను మీడియా సమావేశంలో ఉన్నానని, దీంతో మున్షీని కలిసి వెళ్లిపోయినట్లు చెప్పారు. దీపాదాస్ మున్షీతో చంద్రశేఖర్ రెడ్డికి పెద్దగా పరిచయం లేదని, దీంతో తొందరగా మాట్లాడి వెళ్లిపోయారన్నారు. దీంతో తాను ఫోన్ చేశానని, కూర్చొని మాట్లాడుకుందామని చెప్పానన్నారు.