లోక్ సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు… రఘురాజుపై వేటు వేయాలని మరోసారి విజ్ఞప్తి
-పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు
-ఆధారాలను అందించిన వైసీపీ ఎంపీలు
-19 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాలు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఆ పార్టీ ఎంపీలు ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఓంబిర్లాకు విజయసాయిరెడ్డి ఇటీవల లేఖ కూడా రాశారు. ఈరోజు వైసీపీ ఎంపీలు విజయసాయి, మిథున్ రెడ్డి, భరత్ స్పీకర్ ను మరోసారి కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురాజు పాల్పడుతున్నారని మరిన్ని ఆధారాలను స్పీకర్ కు అందజేశారు. వెంటనే రఘురాజుపై అనర్హత వేటు వేయాలని కోరారు.
అనంతరం మీడియాతో వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ, వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురాజు పాల్పడుతున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. గతంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్ కు అందించామని తెలిపారు. రఘురాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈరోజు మరోసారి కోరామని చెప్పారు. కాగా, ఈ నెల 19 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.