Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సంక్షేమం , స్వయంసమృద్ధి, సమానత్వం మా ఎజెండా: వైయస్ షర్మిల…

సంక్షేమం , స్వయంసమృద్ధి, సమానత్వం మా ఎజెండా: వైయస్ షర్మిల
-వైఎస్సార్ తెలంగాణ పార్టీ అజెండా లోని మూడు ముఖ్యమైన అంశాలు ఇవేఅన్న షర్మిల
-పార్టీ పేరును ప్రకటించిన షర్మిల
-వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఇక అధికారికం
-సంక్షేమం, స్వయంసమృద్ధి, సమానత్వం అజెండా అని వెల్లడి
-ఆయా అంశాల పై షర్మిల వివరణ

వైఎస్ షర్మిల తన పార్టీ పేరును ప్రకటించారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభలో ఆమె ప్రసంగిస్తూ, తన పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తమ పార్టీ అజెండాలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని వెల్లడించారు. అవి 1. సంక్షేమం 2. స్వయంసమృద్ధి 3. సమానత్వం అని వివరించారు.

  1. సంక్షేమం

ప్రజలకు ఆత్మనిబ్బరం దేని ద్వారా కలిగించలగమో, రేపటిపై భరోసా ఎలా ఇవ్వగలమో అదే సంక్షేమం. తమని తాము అభివృద్ధి పర్చుకునేలా అవకాశాలు కల్పించడమై వైఎస్ మార్కు సంక్షేమం. వైఎస్ చూపిన సంక్షేమ బాట ఇవాళ్టికి అందరికీ రోల్ మోడల్ గా ఉంది. రైతులు చల్లగా ఉండాలని రుణమాఫీ చేశాడు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, పావలా వడ్డీకు రుణాలు ఇచ్చాడు. ఏది వీలైతే అది చేశాడు. రైతులకు పెట్టుబడి తగ్గించి రాబడి పెంచాడు. కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తపించి జలయజ్ఞానికి రూపకల్పన చేసిన దార్శనికుడు వైఎస్సార్. ఎవరూ ఊహించని విధంగా విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచితంగా వైద్యం చేయించుకునేందుకు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ లు తీసుకువచ్చారు. మహిళలు లక్షాధికారులు కావాలని పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు.

ఇవాళ్టికీ పెద్దాయనను తెలంగాణలో తలుచుకుంటున్నారంటే ఆయన సంక్షేమ పాలనే. కానీ సీఎం కేసీఆర్ ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. కరోనాతో తెలంగాణలో ఎంతోమంది అయినవారిని కోల్పోయారు. ఆస్తులు కోల్పోయారు. సీఎం కేసీఆర్ ముక్కు నేలకేసి రాసినా వారికి జరిగిన అన్యాయం తీరదు. ప్రజలు బతకడానికి కావాల్సింది ప్రభుత్వమే సమకూర్చాలి… ప్రజలు కష్టపడకూడదన్నదే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం. ప్రజలు ఎప్పుడైతే తమ కనీస అవసరాల గురించి ఆందోళన చెందడం మానేస్తారో, అప్పుడే అభివృద్ధి గురించి ఆలోచించగలరు.

2.స్వయంసమృద్ధి

తరాలు మారుతున్నాయి గానీ ప్రజల తలరాతలు మారడం లేదు. సంక్షేమం అంతా రేషన్ బియ్యం చుట్టూనే తిరుగుతోంది. ఈ తరానికి ఉపాధి కల్పించి స్వయంసమృద్ధి సాధించేందుకు అవసరమైన రీతిలో సంక్షేమం ఉండడంలేదు. సంక్షేమం మనల్ని పేదరికం నుంచి బయటపడేస్తే, స్వయంసమృద్ధి ఆత్మవిశ్వాసంలా బతికేందుకు ఉపయోగపడుతుంది. దీనిపై కేసీఆర్ ను ప్రశ్నిస్తే ఏంచెబుతారో తెలుసా… ఇట్లా అబద్ధాలు చెప్పడానికి అక్కడా అక్కడా తయారయ్యారు. బయటికి వెళ్లి చూస్తే తమ కాళ్ల మీద నిలబడేవాళ్లు కనిపించరా అంటాడు.

రేషన్ షాపుల దగ్గర, కరోనా వైద్యం కోసం ఆసుపత్రుల వద్ద, రైతు కేంద్రాల వద్ద విత్తనాలు, ఎరువుల కోసం, ఉద్యోగాల కోసం రోడ్ల మీద, డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎమ్మెల్యేల ఇంటి ముందు నిలబడడంలేదా అని కేసీఆర్ అంటాడు. ఇంతమంది వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడుతుంటే ఇంకేం కావాలని కేసీఆర్ అంటాడు. కాళ్ల మీద నిలబడడం అంటే అది కాదు. పేదరికం నుంచి మధ్యతరగతి వైపు, మధ్యతరగతి నుంచి స్వయంసమృద్ధి వైపు కదలాలి.

ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో ఈ సమాజంలో బతకాలంటే కావాల్సింది ఒక్కటే… పని. కానీ తాళం వేసి గొళ్లెం మరిచినట్టు ఎన్ని లక్షల కోట్లతో ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టి మాత్రం ఏంలాభం! ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే స్వయంసమృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఉప ఎన్నికలు వచ్చినప్పుడే ఉద్యోగాల ఊసెత్తుతారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఈ పరిస్థితులను మార్చడానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ వస్తోంది. స్వయంసమృద్ధి సాధనే మా పార్టీ లక్ష్యం.

3.సమానత్వం

ఒక పువ్వుకు ఉన్న రంగు, రూపం, సువాసన ఇతర పూవులకు భిన్నంగా ఉంటుంది. అయితే ఎన్నో పూలను పేర్చిన బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో, అలాగే వివిధ వర్గాలను ఒక్కచోట చేరిస్తే అది అందమైన తెలంగాణ అవుతుంది. వైఎస్సార్ కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా గౌరవించారు, సమానంగా ప్రేమించారు, అందరి అవసరాలు తీర్చారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా ఈ సూత్రాన్నే స్ఫూర్తిగా తీసుకుంటుంది. కులాలు, మతాలు పట్టించుకోదు, ఉన్నవారు లేనివారు, మెజారిటీలు మైనారిటీలు, పురుషులు స్త్రీలు అనే తేడా చూపించదు. అందరినీ సమానంగా చూస్తాం, అందరినీ గౌరవిస్తాం. ఇదే మా పార్టీ సిద్ధాంతం అని షర్మిల తన పార్టీ సిద్ధాంతాలను వివరించారు.

Related posts

1 ,2 ,3 ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పరిపాలన మంత్రి బొత్స…

Drukpadam

కేటీఆర్.. నువ్వే కొత్త బిచ్చగాడివి: మధు యాష్కి ఫైర్!

Drukpadam

నూతన పార్టీకి అధికార ప్రతినిధులను నియమించిన వైఎస్ షర్మిల

Drukpadam

Leave a Comment