Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులు ఈటలను ఓడించగలరా ?బండి సంజ‌య్‌!

గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులు ఈటలను ఓడించగలరా ?బండి సంజ‌య్‌!
-హుజూరాబాద్‌లో ఈట‌ల గెలిచాక నేరుగా అయోధ్యకు వెళతాం
-ఈటల పాద‌యాత్రతో కేసీఆర్ కు నిద్ర ప‌ట్ట‌డం లేదు
-హైదరాబాదులో అతి పెద్ద‌ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
-ఆరుసార్లు గెలిచినా.. ధర్మంగానే గెలిచా: ఈటల రాజేందర్​
-హుజూరాబాద్ లో రెండేళ్లకోసారి యుద్ధం చేయాల్సి వస్తోంది
-తన పక్కన ఎవరూ ఉండకుండా ఎత్తులు వేస్తున్నారు
-నేను ప్రజలనే నమ్ముకున్నా.. 2023లో ఎగిరేది కాషాయ జెండానే

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గానికి ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హుజూరాబాద్‌లో బ‌లం పెంచుకోవ‌డానికి ప్ర‌ధాన పార్టీల నేత‌లు ఆ ప్రాంతంలో ప‌ర్య‌ట‌న‌లు జ‌రుపుతున్నారు. ఈ రోజు హుజూరాబాద్‌లో ప‌ర్య‌టిస్తోన్న‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ మంత్రుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. వారు గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకుంటార‌ని, అటువంటి వారు ఈటలను ఓడించగ‌ల‌రా? అని ప్రశ్నించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఈటల రాజేందర్ గెలిచిన అనంత‌రం నేరుగా అయోధ్యకు వెళతామని చెప్పారు. హుజూరా‌బాద్‌లో ఈటల రాజేంద‌ర్ పాదయాత్ర చేస్తుండ‌డంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. దళిత బంధు ప‌థ‌కాన్ని సీఎం కేసీఆరే నిలిపేసి, ఆ నెపాన్ని త‌మ పార్టీ మీదకు నెట్టేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక‌ హైదరాబాద్ లో తాము అతి పెద్ద‌ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామ‌ని, ఈ విష‌యంలో గ‌తంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోలేద‌ని విమర్శించారు.

వారు డబ్బును అధికారాన్ని నమ్మితే …నేను ప్రజలనే నమ్ముతా: ఈటల

రెండేళ్లకోసారి హుజూరాబాద్ లో ఎందుకో యుద్ధం చేయాల్సి వస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2008, 2010లో రాజీనామా చేస్తే భారీ మెజారిటీతో తనను గెలిపించారని, ప్రజలే తనకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారని ఆయన అన్నారు. ‘ప్రజాదీవెన యాత్ర’లో భాగంగా ఆరోరోజు ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలో పాదయాత్ర చేశారు.

ఆరుసార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచినా ధర్మంగానే గెలిచానని ఈటల అన్నారు. తన పక్కన ఎవరూ ఉండకుండా చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని, వారు డబ్బు, అధికారాన్ని నమ్మితే తాను ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు. టీఆర్ఎస్ బీఫాంతోనే తాను గెలిస్తే.. మరి, మిగతా టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఓడిపోయారని ఆయన ప్రశ్నించారు. 2023లో రాష్ట్రంపై కాషాయ జెండా ఎగురుతుందన్నారు.

Related posts

సీఎంను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులా ?.. దమ్ముంటే నాపై పెట్టండి: బండి సంజయ్ సవాల్!

Drukpadam

తిరుపతిని రాజధానిని చేయండి: మాజీకేంద్ర మంత్రి చింతా మోహన్!

Drukpadam

తుమ్మలపై నిఘానేత్రాలు …రాజకీయ ఉద్దండుడి చూపు ఎటువైపు …?

Drukpadam

Leave a Comment