ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీ!
వ్యవసాయ చట్టాలకు నిరసనగా ట్రాక్టర్ పై వచ్చిన రాహుల్
ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తల కోసమే ఈ చట్టాలని మండిపాటు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ నడుపుతూ ఆయన పార్లమెంటుకు వచ్చారు. మాస్క్ ధరించి ఆయన ట్రాక్టర్ ను నడిపారు.
రైతుల సందేశాన్ని తాను పార్లమెంటుకు తీసుకొచ్చానని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు. రైతన్నల గొంతులను కేంద్ర ప్రభుత్వం నొక్కేస్తోందని… రైతు సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఈ కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తల కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చారనే విషయం యావత్ దేశానికి తెలుసని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాల పట్ల రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారని కేంద్రం చెపుతోందని… ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న వారిని టెర్రరిస్టులు అంటోందని మండిపడ్డారు. రైతుల హక్కులను కేంద్రం అణచివేస్తోందని అన్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 19న ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాలకు ఒక రోజు ముందే పెగాసస్ స్పైవేర్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో, పార్లమెంటు ఉభయసభలు ఈ అంశంపై దద్దరిల్లుతున్నాయి. గత వారం ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగినప్పటికీ విపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చకు వీలుపడలేదు.