అశ్లీల చిత్రాల కేసు.. ఐదు నెలల్లోనే రూ. 1.17 కోట్లు సంపాదించిన రాజ్‌కుంద్రా
-అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాపై ఆరోపణలు
-ఒక్క యాపిల్ స్టోర్ నుంచే కోట్ల రూపాయల సంపాదన
-గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇంకా ఎక్కువే వచ్చి ఉంటుందన్న పోలీసులు
-కుంద్రా బెయిలు పిటిషన్ తిరస్కరణ
అశ్లీల చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌కుంద్రా గతేడాది ఆగస్టు-డిసెంబరు మధ్య ఆ చిత్రాల ద్వారా ఏకంగా రూ. 1.17 కోట్లు ఆర్జించినట్టు ముంబై పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. అది కూడా ఒక్క యాపిల్ స్టోర్ నుంచే ఈ మొత్తం సమకూరిందని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇంతకుమించి వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇవ్వాల్సిందిగా గూగుల్‌ను కోరినట్టు తెలిపారు.
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సహ నిందితుడు ర్యాన్ థోర్పె విచారణలో ఈ విషయాలను వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, కుంద్రా పోలీస్ కస్టడీ నిన్నటితో ముగియడంతో మరికొంతకాలం పొడిగించాలన్న పోలీసుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కుంద్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, అత్యవసర బెయిలు కోసం కుంద్రా పెట్టుకున్న పిటిషన్‌ను నిన్న బాంబే హైకోర్టు తిరస్కరించింది.