ఆడపిల్లలకు అర్ధరాత్రి బీచ్ లో ఏం పని?: అసెంబ్లీలో గోవా సీఎం సంచలన వ్యాఖ్యలు
అర్ధరాత్రి పిల్లలు బయటకు వెళ్తున్నారంటే తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి
పిల్లలను నిలువరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా?
ఏదైనా జరిగిన తర్వాత పోలీసులను నిందిస్తే ఎలా?
అర్ధరాత్రి వేళ ఆడపిల్లలు బయటకు వెళ్తున్నారంటే వారి తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. అర్ధరాత్రి ఆడపిల్లలకు బీచ్ లో ఏం పని? అని ఆయన ప్రశ్నించారు. పిల్లలను నిలువరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా? అని నిలదీశారు. తప్పు వారి వద్ద పెట్టుకుని బాధ్యతారాహిత్యం అంటూ ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సరికాదని ఆయన అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఇద్దరు మైనర్ బాలికలపై గోవాలో అత్యాచారం జరిగింది. ఈ అంశంపై గోవా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, బీచ్ పార్టీకి వెళ్లిన వారిలో అత్యాచారానికి గురైన అమ్మాయిలు తప్ప మిగిలిన వారంతా ఇళ్లకు తిరిగొచ్చారని అన్నారు. తల్లిదండ్రుల మాటను పిల్లలు వినకపోతే… ఆ తర్వాత జరిగే పరిణామాలకు పోలీసులను ఎలా బాధ్యులను చేయగలమని ప్రశ్నించారు.
మరోవైపు సీఎం వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడతారా? అని మండిపడుతున్నారు. సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.