ఆరుగురు తృణమూల్ ఎంపీలను బహిష్కరించిన రాజ్యసభ!
వెల్ లోకి వెళ్లి ప్లకార్డులతో నిరసన
వెళ్లి కూర్చోకుంటే సస్పెండ్ చేస్తానన్న చైర్మన్
అయినా వెనక్కు తగ్గని ఎంపీలు
రూల్ 255తో ఒక రోజంతా సస్పెన్షన్
పార్లమెంట్ లో పెగాసస్ మంటలు ఆగటంలేదు . పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినా దగ్గరనుంచి ఉభయసభల్లో ప్రతిపక్షాలు సమావేశాలను అడ్డుకుంటూనే ఉన్నాయి. పెగాసస్ పై చర్చకు పట్టుపడుతున్నాయి. ప్రభుత్వం ససేమీరా అంటుంది. దీంతో సభలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. బుధవారం రాజ్యసభలో ఈ అంశాన్ని టీఎంసీ సభ్యులు లేవనెత్తారు. వారు వెల్ లోకి దూసుకొచ్చి ప్లే కార్డులు ప్రదర్శించారు. దీంతో సభ స్థానంలో ఉన్న చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులను శాంతించాలని కోరారు .వారు ఎంతసేపటికి వినకపోవడంతో 6 గురు టీఎంసీ సభ్యులను సభనుంచి ఈ రోజుకు సస్పెండు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీచేశారు.
సమావేశాలకు పదే పదే అంతరాయం కలిగిస్తుండడంతో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. బుధవారం సభ ప్రారంభమవగానే పెగాసస్ వివాదంపై తృణమూల్ ఎంపీలు రచ్చ మొదలుపెట్టారు. సభ వెల్ లోకి దూసుకెళ్లి.. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఎంత సేపటికి వారు వెల్ నుంచి కదలలేదు . వారిపై రూల్ 255 చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అందరూ వెనక్కు వెళ్లి సీట్లలో కూర్చోవాల్సిందిగా చైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు. లేదంటే చైర్మన్ ను, సభను గౌరవించని కారణంగా రూల్ 255 ప్రకారం అందరినీ బయటకు పంపించేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా వారు వెనక్కు తగ్గకపోవడంతో ఆరుగురు ఎంపీలను ఈ రోజంతా సభ నుంచి బహిష్కరించారు.
ఆ తర్వాత పార్లమెంటరీ బులెటిన్ లో బహిష్కరణకు గురైన ఎంపీల వివరాలను వెల్లడించారు. దోలా సేన్, మహ్మద్ నదీముల్ హక్, అబీర్ రంజన్ బిశ్వాస్, శాంతా ఛెత్రి, అర్పితా ఘోష్, మౌసమ్ నూర్ లను ఒక రోజు పాటు సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.