దళితబందు డబ్బు ఇస్తాం…బట్ కండిషన్స్ అప్లై
-దళితబంధు డబ్బు వినియోగించే విధానం
-ఏ ఆస్తులు కొనొచ్చు.. ఏ యూనిట్లు స్థాపించొచ్చు
-దళితబంధు కింది ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల సాయం
-నాలుగు వర్గాలుగా విభజించిన ప్రభుత్వం
-మరో రెండు రోజుల్లో విధివిధానాలను విడుదల చేయనున్న సర్కార్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వనున్నారు. మరోవైపు ఈ ఆర్థిక సాయంతో ఏయే ఆస్తులు కొనుగోలు చేయొచ్చు? ఏయే యూనిట్లు స్థాపించవచ్చు? అనే వివరాలతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ పథకం కింద గ్రామాలు, గ్రామాలు-ఉప పట్టణాలు, గ్రామాలు-పట్టణాలు, పట్టణాలు ఇలా నాలుగు రకాలుగా ప్రభుత్వం విభజించింది. గత ప్రభుత్వ పథకాలకు భిన్నంగా 30 రకాలను ఇందులో పొందుపరిచింది.
ప్రభుత్వం విడుదల చేసిన జాబితా:
గ్రామాలు: 10 నుంచి 12 గేదెలతో మినీ డెయిరీ యూనిట్. వేపనూనె- పిండి తయారీ, ఆటో ట్రాలీ.
గ్రామాలు-ఉప పట్టణాలు: మట్టి ఇటుకల తయారీ- ఆటో ట్రాలీ, ట్రాక్టర్ ట్రాలీ, కోడి పిల్లల పెంపకం (నాటు, బ్రాయిలర్ కోళ్లు)-ఆటో ట్రాలీ, సాగు యంత్ర పరికరాల దుకాణం.
గ్రామాలు-పట్టణాలు: 3 ఆటో రిక్షాలు, సరుకు రవాణా చేసే మూడు చక్రాల ఆటో ట్రాలీలు 3, సెవెన్ సీటర్ ఆటో, ప్రభుత్వం అనుమతించిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణం… డెకరేషన్ లైటింగ్, టెంట్ హౌస్, సౌండ్ సిస్టమ్-ఆటో ట్రాలీ, ఆయిల్ మిల్లు-పిండి గిర్నీలు, వ్యాపారం (సొంత ఇంటి స్థలం ఉన్నవారు).
పట్టణాలు: రోగ నిర్ధారణ కేంద్రం-మెడికల్ షాపు, ఎలక్ట్రికల్ బ్యాటరీ షాపు, 4 చక్రాల సరకు-ప్రయాణికుల వాహనం, ఎలక్ట్రానిక్స్ దుకాణం, హార్డ్ వేర్- శానిటరీ షాపు- ఆటో ట్రాలీ, సిమెంట్ ఇటుకల తయారీ- ఆటో ట్రాలీ, సెంట్రింగ్ ఆర్సీపీ రూఫ్ తయారీ- కాంక్రీట్ మిశ్రమం తయారీ యంత్రం, టైల్స్- ఆక్రిలిక్ షీట్ల తయారీ- ఆటో ట్రాలీ, మూడు కాంక్రీట్ మిశ్రమ తయారీ యంత్రాలు, ఐరన్ గేట్లు-గ్రిల్స్ తయారీ యూనిట్- ఆటో ట్రాలీ, హోటల్ క్యాటరింగ్- ఆటో ట్రాలీ, మెడికల్ స్టోర్స్, మినీ సూపర్ బజార్, డీటీపీ- మీ సేవ ఫొటో స్టూడియో, హార్డ్ వేర్ దుకాణం, బిల్డింగ్ సామాగ్రి షాప్.
వీటి కొనుగోళ్లు, స్థాపనకు సంబంధించిన విధివిధానాలను రెండు రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనుంది.