దేశ ప్రజలందరికీ తాలిబన్ల క్షమాభిక్ష.. ప్రభుత్వ ఉద్యోగులందరూ విధుల్లో చేరాలని ప్రకటన!
-దేశాన్ని చేజిక్కించుకున్న రెండు రోజులకు తాలిబన్ల ప్రకటన
-రోజువారీ కార్యకలాపాల్లో ఉద్యోగులంతా యథావిధిగా పాల్గొనాలని పిలుపు
-పూర్తి విశ్వాసంతో విధులు చేపట్టాలని సూచన
ఆఫ్ఘనిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో దేశ ప్రజలందరికీ క్షమాభిక్షను ప్రసాదిస్తున్నామని తాలిబన్లు ప్రకటించారు. దేశాన్ని చేజిక్కించుకున్న రెండు రోజుల తర్వాత తాలిబన్ల నుంచి ఈ ప్రకటన వెలువడింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ పూర్తి విశ్వాసంతో విధుల్లోకి చేరాలని సూచించారు. రోజువారీ కార్యకలాపాల్లో యథావిధిగా పాల్గొనాలని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాలిబన్ల ప్రకటన నేపథ్యంలో అక్కడి ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
అమెరికాకు సహకరించిన వారిపై తాలిబన్ల గురి.. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ!
కాబుల్ లో తాలిబన్ శకం ప్రారంభమైంది. నిన్ననే కాబుల్ చేరుకున్న తాలిబన్ బలగాలు పాలనపై పట్టు సాదించేందుకు ఉపక్రమించాయి. . ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించబోమని ఓవైపు చెపుతూనే… మరోవైపు తమ మార్క్ చర్యలను ప్రారంభించారు. గత ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, అమెరికా సైన్యానికి సహకరించిన వారి వివరాలను తాలిబన్లు సేకరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి పూర్తి వివరాలను కనుక్కుంటున్నారు. దీంతో కాబూల్ వాసులు భయంతో వణికిపోతున్నారు.
రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా బతికిన కాబూల్ ప్రజలు… మళ్లీ తాలిబన్లు రావడంతో భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరిని తీసుకెళ్లి చంపేస్తారో అనే భయంతో క్షణమొక యుగంలా గడుపుతున్నారు. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేయడాన్ని తాలిబన్లు ప్రారంభించారు. దీనికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రధాన సవాలుగా మారాయి: కేంద్రమంత్రి జై శంకర్
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ పాలన మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో, స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారికి కాబూల్ విమానాశ్రయంలో ఎదురవుతున్న పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ కు తిరిగి రావాలనుకునే వారి ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, కానీ కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రధాన సవాలుగా మారాయని పేర్కొన్నారు. ఈ అంశంలో ఆఫ్ఘన్ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
కాబూల్ లో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వివరించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఓ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాబూల్ లో ఉన్న సిక్కులు, హిందూ సంఘాల నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, భారత పౌరుల సంక్షేమమే తమకు ప్రథమ ప్రాధాన్యత అని జై శంకర్ ఉద్ఘాటించారు.
కాబూల్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారతీయుల గురించి కచ్చితమైన సమాచారం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎవరివద్ద అయినా కీలక సమాచారం ఉంటే 919717785379 ఫోన్ నెంబరుకు గానీ, MEAHelpdeskIndia@gmail.com ఈమెయిల్ ఐడీకి గానీ అందించాలని సూచించారు.