ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చి భారత్‌లో అక్రమ నివాసం.. పంపించేస్తే వెళ్లి తాలిబన్లలో చేరాడు!
-పర్యాటక వీసాపై దేశానికి నూర్ మహమ్మద్
-శరణార్థిగా గుర్తించాలని దరఖాస్తు
-ఐరాస మానవహక్కుల మండలి తిరస్కరణ
-జూన్ 23న ఆప్ఘనిస్థాన్ పంపించి వేసిన పోలీసులు
-తాలిబన్లతో కలిసి తుపాకి పట్టుకున్న ఫొటోవైరల్
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చి ఇండియాలో అక్రమంగా నివసిస్తున్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతడిని స్వదేశం పంపించేశారు. అలా దేశం విడిచి వెళ్లిన అతడు తాలిబన్లలో కలిసిపోయాడు. వారితో కలిసి తుపాకి పట్టుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర పోలీసుల కథనం ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన నూర్ మహమ్మద్ 2010లో ఆరు నెలల పర్యాటక వీసాపై మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వచ్చాడు. ఆ తర్వాత అతడు తనను శరణార్థిగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి అతడి దరఖాస్తును తిరస్కరించింది. దీంతో దేశం విడిచి వెళ్లాల్సిన నూర్ ఆ పనిచేయకుండా.. అప్పటి నుంచి నాగ్‌పూర్‌లోని దిఘోరీ ప్రాంతంలో అక్రమంగా ఉండసాగాడు.
నిఘా వర్గాల సమాచారంతో నూర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఏడాది జూన్ 23న ఆఫ్ఘనిస్థాన్ పంపించివేశారు. తాజాగా అతడు తాలిబన్లతో కలిసి తుపాకి పట్టుకుని ఉన్న ఫొటో వైరల్ కావడంతో మళ్లీ నూర్ గురించి చర్చ ప్రారంభమైంది. ఆఫ్ఘనిస్థాన్ వెళ్లిపోయిన తర్వాత అతడు తాలిబన్లలో కలిసిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. నూర్ అసలు పేరు అబ్దుల్ హకీ అని, అతడి సోదరుడు ఎప్పటి నుంచో తాలిబన్లతో కలిసి పనిచేస్తున్నాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.