యువకుడి పొట్టలో రూ.11 కోట్ల విలువైన కొకైన్.. విమానాశ్రయంలో పట్టివేత
-విమానంలో ఆహారం తీసుకోని వ్యక్తి
-అనుమానం వచ్చి స్కాన్ చేసిన అధికారులు
-దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చినట్లు గుర్తింపు
-ఆఫ్రికా నుంచి డ్రగ్స్ తరలిస్తున్న వైనం
డ్రగ్స్‌ను తరలించడానికి కేటుగాళ్లు ఎన్నో మార్గాలను ఎంచుకుంటున్నారు. అయినప్పటికీ దొరికిపోయి జైలుకు వెళ్తున్నారు. పొట్టలో డ్రగ్స్ పెట్టుకుని విమానం ఎక్కి బెంగళూరు చేరుకున్న ఓ యువకుడిని అధికారులు అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి వచ్చే ఓ ఫ్లైట్ ఎక్కాడు ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి. అయితే, విమానంలో అతడు ఆహారం తినలేదు, పానియాలూ తాగలేదు. దీంతో అతడిపై సిబ్బందికి అనుమానం వచ్చింది. బెంగళూరు విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు.
విమానం దిగగానే అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు స్కాన్ చేయగా అతడి పొట్టలో కొకైన్ ఉన్నట్లు తేలింది. దక్షిణాఫ్రికాలోని ఓ డ్రగ్స్ వ్యాపారి తమ దేశానికి చెందిన ఓ వ్యక్తిని దుబాయ్ మీదుగా బెంగళూరుకు పంపించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై తదుపరి విచారణ జరుపుతున్నారు.