తెలంగాణ గవర్నర్‌గా యడియూరప్ప?
🖊️: తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా? ప‌్రస్తుత గవర్నర్ తమిళిసై మరో రాష్ట్రానికి వెళ్లక తప్పదా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను అతి త్వరలోనే తెలంగాణ గవర్నర్‌గా పంపబోతున్నట్టుగా చర్చ జరుగుతోంది. ప్రస్తతం పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న తమిళిసైని పూర్తిస్థాయి గవర్నర్‌గా నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది.
సీఎం పదవికి ఇటీవల రాజీనామా చేసిన యడియూరప్పను తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా…ఆ రాష్ట్రంలోనే ఉంచడం ప్రమాదకరమని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. కర్ణాటక బీజేపీలోనే అత్యంత సీనియర్, బలమైన నేత అయిన యడియూరప్పను ఏ పదవీ లేకుండా ఎక్కువ రోజులు ఖాళీగా ఉంచితే.. అది మరో రాజకీయ సంక్షోభానికి దారి తీయొచ్చని అధిష్టానం అంచనా వేస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదంటే.. ఆయన్ను గౌరవంగా రాష్ట్రం దాటించడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణకు ఆయన్ను గవర్నర్‌గా పంపాలని అనుకుంటున్నట్టుగా కర్ణాటక బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
యడియూరప్పను తెలంగాణకే పంపడానికి కూడా ప్రత్యేక కారణాలున్నాయని తెలుస్తోంది. దూరపు రాష్ట్రాలకు పంపిస్తే ఇల్లు, బంధువులు అనే సాకుతో కర్ణాటకకు వచ్చి మళ్లీ పార్టీ, ప్రభుత్వంలో జోక్యం చేసుకునే అవకాశం ఉండొచ్చన్నది అధిష్టానం భయమని చెబుతున్నారు. .అదే తెలంగాణకు పంపిస్తే పొరుగు రాష్ట్రమే కావడంతో పదే పదే కర్ణాటకకు రావాల్సిన అవసరం లేదని, అవసరమైతే బంధువులు, ఆయన సన్నిహితులు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రావడం పెద్ద కష్టం కాకపోవచ్చని అంచనా వేస్తోందని అంటున్నారు. అలాగే రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన యడియూరప్పను తెలంగాణకు పంపితే.. ఇక్కడి బీజేపీలో వైబ్రేషన్స్ పెరగొచ్చన్నది అధిష్టానం ఆలోచనగా అంచనా వేస్తున్నారు.