Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అత్యాచార బాధితురాలి ఆత్మహత్యకు కారణమైన దుష్ప్రచారం.. మాజీ ఐపీఎస్ అధికారి అరెస్ట్!

అత్యాచార బాధితురాలి ఆత్మహత్యకు కారణమైన దుష్ప్రచారం.. మాజీ ఐపీఎస్ అధికారి అరెస్ట్
-అత్యాచార బాధితురాలిపైనే వేధింపులు
-సుప్రీంకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నం.. ఆపై మృతి
-మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ప్రమేయం
-తేల్చిన సిట్ నివేదిక
-వచ్చే నెల 9 వరకు జుడీషియల్ కస్టడీ

తనపై అత్యాచారం చేసిన బీఎస్పీ ఎంపీ అతుల్‌రాయ్‌పై కేసు పెట్టినందుకు పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఇటీవల సుప్రీంకోర్టు వద్ద ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌ను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. పది రోజుల క్రితం యూపీకి చెందిన యువతీ యువకుడు సుప్రీంకోర్టు ప్రాంగణంలో వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. సమీపంలోనే ఉన్న పోలీసులు మంటలు ఆర్పి వారిని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బాధితులిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు గల కారణాలు వివరించారు.

24 ఏళ్ల బాధిత యువతి మాట్లాడుతూ.. అత్యాచార బాధితురాలినైన తనను యూపీ పోలీసులు చరిత్ర హీనురాలిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ నేతలు, పోలీసులు కుమ్మక్కై తనను వేధిస్తున్నారని వాపోయింది. వారి వేధింపులు తాళలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. హిస్టరీ షీటర్ (నేర చరిత కలిగిన వ్యక్తి) అయిన ఓ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆమె.. ఎస్పీ, పోలీసులు, రాజకీయ నేతలు, ప్రయాగ్‌రాజ్ కోర్టు న్యాయమూర్తి కలిసి తనను వేధిస్తున్నారని ఆరోపించింది. గత నెల 9న తాను కోర్టుకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి అందులో పేర్కొన్న వారితో పోలీసులు కుమ్మక్కై తనపైనే తిరిగి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ కేసు దర్యాప్తును చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. బాధితురాలిపై అపవాదు మోపి, ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పడంలో అమితాబ్ ఠాకూర్ పాత్ర ఉందని తేల్చింది. సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు అమితాబ్‌ ఠాకూర్‌ను అరెస్ట్ చేశారు. కాగా, తానో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు అమితాబ్ ఠాకూర్ నిన్న ఉదయమే ప్రకటించారు. గతంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన అమితాబ్ ఠాకూర్‌తో కేంద్రం ఇటీవల నిర్బంధ పదవీ విరమణ చేయించింది. కాగా, అమితాబ్ ఠాకూర్‌కు లక్నో కోర్టు వచ్చే నెల 9 వరకు జుడీషియల్ కస్టడీకి పంపింది.

Related posts

ఫ్లోరిడాలో యాక్సిడెంట్.. భారతీయ టెకీ దుర్మరణం…!

Drukpadam

పాకిస్థాన్‌లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిందా మృతి!

Drukpadam

కెనరా బ్యాంకు ఉద్యోగి స్వప్న ఆత్మహత్య …

Drukpadam

Leave a Comment