Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

‘తాలిబన్​’ పదాన్ని తొలగించిన ఐరాస భద్రతా మండలి….

‘తాలిబన్​’ పదాన్ని తొలగించిన ఐరాస భద్రతా మండలి

  • పాత ప్రకటనలో మార్పులు
  • తాలిబన్ లేకుండా కొత్త ప్రకటన
  • రాత్రికి రాత్రే మార్పులు జరిగిపోతాయన్న ఐరాస భారత ప్రతినిధి

‘దౌత్య సంబంధాల్లో రాత్రికి రాత్రే మార్పులు జరిగిపోతాయి’.. ఇదీ ఐక్య రాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్. అవును నిజమే.. రాత్రికి రాత్రే ఏదైనా జరిగిపోవచ్చు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడా ఉంది.. అదేంటంటే పాత ప్రకటనను ఐరాస మార్చి ఇవ్వడం. కొత్త ప్రకటనలో ‘తాలిబన్’ పదాన్ని తొలగించడం.

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు ఎంత ఆందోళనకరంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించిన మరుసటిరోజే అంటే.. ఈ నెల 16న భద్రతా మండలి ఓ ప్రకటనను విడుదల చేసింది.

‘‘ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదంపై పోరుకు భద్రతా మండలి సభ్యులందరూ ప్రాధాన్యతనిచ్చారు. ఆఫ్ఘనిస్థాన్ గడ్డపై నుంచి ఏ దేశం మీదా ఉగ్రవాద దాడులు జరగకూడదు. తాలిబన్లుగానీ, ఇతర ఆఫ్ఘనిస్థాన్ సంస్థలు గానీ అక్కడ ఉగ్రవాదాన్ని గానీ, ఉగ్రవాదుల్నిగానీ ప్రోత్సహించరాదు’’ అని ఆ ప్రకటనలో భద్రతా మండలి పేర్కొంది.

అయితే, తాజాగా ఆ ప్రకటనను మార్చింది. ‘తాలిబన్లు గానీ’ అన్న ఒక్క పదాన్ని తీసేసి మిగతా ప్రకటననంతా సేమ్ టు సేమ్ ఉంచేసింది. ఈ మార్పులకు కారణం.. విదేశీయుల తరలింపులకు తాలిబన్లు సహకరిస్తుండడమేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి అవాంతరాలు లేకుండా విదేశీయుల తరలింపు జరిగిందని, దానికి తాలిబన్ల నుంచి సహకారం అందిందని అంటున్నారు. పాత, కొత్త ప్రకటనలను సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ‘‘దౌత్య సంబంధాల్లో రాత్రికి రాత్రే ఏదైనా జరిగిపోవచ్చు. ‘టీ’ పదం పోయింది. ఐరాస భద్రతా మండలి ప్రకటనలను ఓసారి చూడండి’’ అంటూ ట్వీట్ చేశారు.

Related posts

మరోసారి వివాదంలో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డా. శ్రీనివాసరావు!

Drukpadam

వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధర చట్టం తేవాలి…

Drukpadam

గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్ట్‌… ఖండించిన రాహుల్ గాంధీ!

Drukpadam

Leave a Comment