దుకాణాల్లో కార్మికులకు ‘కూర్చునే హక్కు’ను కల్పిస్తూ తమిళనాడు సర్కారు బిల్లు.. మండిపడుతోన్న వ్యాపారులు!
-కార్మికులు పనిచేసే చోట కుర్చీలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాల్సిందే
-దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థల చట్టం-1947కు సవరణ
-కార్మికులు గంటల తరబడి నిల్చుని పనిచేసే ఇబ్బందులకు చెక్
-కార్మికుల్లో ఉత్సాహం తగ్గుతుందంటూ వ్యాపారుల అసంతృప్తి
-బిల్లు ప్రవేశపెట్టినందుకు కార్మికుల హర్షం
తమిళనాడులో దుకాణాలతో పాటు ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులందరికీ కూర్చునే హక్కును కల్పిస్తూ అసెంబ్లీలో తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్ కు ఆమోదముద్రపడితే కార్మికుల కోసం దుకాణాల యజమానులు.. కార్మికులు పనిచేసే చోట కుర్చీలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తుండగా, వ్యాపారులు మండిపడుతున్నారు.
దుకాణాల్లో కార్మికులకు కూర్చునే హక్కును కల్పించే బిల్లును తమిళనాడు కార్మిక సంక్షేమ శాఖ మంత్రి సీవీ గణేశన్ ప్రవేశపెట్టారు. ఇందుకుగాను దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థల చట్టం-1947ను సవరించనున్నారు. దుకాణాల్లో పనిచేస్తోన్న కార్మికులు గంటల తరబడి నిల్చుని పనిచేస్తూ ఇబ్బందులు పడుతోన్న తీరును పరిగణనలోకి తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లులో పేర్కొంది. ఈ బిల్లు ఆమోదం పొందితే దుకాణాల్లో కార్మికులు కూర్చునే హక్కును పొందుతారని తెలిపింది.
తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై కార్మికులు ఓ పక్క హర్షం వ్యక్తం చేస్తోంటే, మరోవైపు, వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని శాంథోమ్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసే మణిమేఖల అనే కార్మికురాలు మీడియాతో మాట్లాడుతూ… చాలా కాలంగా తాము ఎదురు చూస్తున్న హక్కును కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టిందంటూ హర్షం వ్యక్తం చేసింది. పనిచేసే చోట ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడే ఉండాల్సి ఉంటుండడంతో తాము పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు.
మరోవైపు, టీ నగర్‌లోని ఓ వస్త్ర దుకాణ యజమాని మీడియాతో మాట్లాడుతూ…. తాము ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే, ప్రభుత్వం ఇటువంటి బిల్లును ప్రవేశ పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ చర్య వల్ల కార్మికుల్లో పని చేయాలన్న ఉత్సాహం తగ్గిపోతుందని, ఉత్పాదకత తగ్గుతుందని చెప్పుకొచ్చారు. దుకాణంలో వారి పని తీరు మందగిస్తుందని అన్నారు.
మరికొందరు వ్యాపారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెన్నైలోని పురసవాకంలోని ఓ వ్యాపారి మీడియాతో మాట్లాడుతూ… ఇటువంటి బిల్లు ప్రవేశ పెట్టడం దురదృష్టకరమని చెప్పారు. దీనివల్ల ఇన్నాళ్లు కార్మికుల హక్కులను అడ్డుకున్నామని వారు అనుకునే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. కూర్చునే హక్కు కల్పిస్తే వారు పనిలో ఉత్సాహం చూపరని, పనిపై దృష్టి పెట్టబోరని అభిప్రాయపడ్డారు.
కాగా, కేరళలోనూ ఇప్పటికే కార్మికుల కోసం కూర్చునే హక్కును కల్పిస్తూ చట్టం తీసుకుకొచ్చారు. ఊమెన్ చాందీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, శింబు బేబి జాన్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్ల-1964ను సవరించారు. రాష్ట్ర యువజన సంక్షేమ కమిషన్ సిఫార్సుల మేరకు అప్పట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఈ హక్కును సాధించినందుకు గాను దుకాణాల్లో పనిచేసే వారంతా సంబరాలు చేసుకున్నారు.