సినీ పరిశ్రమపై చర్చించేందుకు చిరంజీవి బృందానికి సీఎం జగన్ పిలుపు!
-ఈ నెల 20న సీఎంను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి బృందం
-సమస్యలను వివరించేందుకు అపాయింట్‌మెంట్ కోరిన సినీ పెద్దలు
-20న రావాలంటూ పేర్ని నాని ద్వారా జగన్ వర్తమానం
-చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించనున్న చిరు బృందం
ఆంధ్రప్రదేశ్ లో సినీ టిక్కెట్ల విక్రయాలు ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించడం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ పరిశ్రమ భగ్గుమంటున్నది . అందువల్ల సినీ ప్రముఖులు చిరంజీవి నేతృత్వంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిసి చర్చలని నిర్ణయించుకోవడం ఆయన అపాయింట్మెంట్ కోరడంతో అందుకు అంగీకరించిన సీఎం జగన్ ఈ నెల 20 న చిరంజీవి బృందాన్ని చర్చలకు ఆహ్వానించారు .
మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నారు. కరోనా నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పలు సమస్యలు ఎదుర్కొంటోందని, ముఖ్యమంత్రిని కలిసి వీటిని విన్నవించాలనుకుంటున్నామంటూ ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. ఈ నెల 20న అపాయింట్‌మెంట్ ఇచ్చారు. పేర్ని నాని నుంచి సమాచారం అందడంతో 20న జగన్‌ను కలిసేందుకు చిరంజీవి సారథ్యంలోని బృందం రెడీ అవుతోంది. సీఎం జగన్‌ను కలవనున్న వారిలో అక్కినేని నాగార్జున, దిల్‌రాజు, సురేశ్‌బాబు తదితరులు ఉన్నారు.
ఇక, జగన్ దృష్టికి తీసుకెళ్లనున్న అంశాలపై చిత్రపరిశ్రమ ప్రముఖులు ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. వీటిలో కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు వేసే అవకాశం కోరడం, నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు కల్పించడంతోపాటు గ్రేడ్-2 కేంద్రాల్లో నేల టికెట్టుకు పది రూపాయలు, కుర్చీకి రూ.20 వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయవద్దని కోరడం వంటివి ఉన్నాయి. సినిమా టికెట్లను ఇకపై ప్రభుత్వమే విక్రయించాలని నిర్ణయించడంపైనా చిరంజీవి బృందం ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.