Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ 

చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ 
అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై వైసీపీ నేతల నిరసన
ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నం
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
భారీగా పోలీసుల మోహరింపు
జోగి రమేశ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి..లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు :అచ్చెన్నాయుడు
వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై మాట్లాడితే తప్పా?
జోగి రమేశ్ ఎమ్మెల్యేనా లేక గూండానా?
రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శ …

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసం ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో భాగంగా పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్దకు భారీగా తరలివచ్చారు. ఇంటి గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. రెండు వర్గాల వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ కార్యకర్తల నిరసన గురించి తెలిసి టీడీపీ కార్యకర్తలు భారీగా చంద్రబాబు నివాసానికి తరలివస్తున్నారు.

అయితే, వైసీపీ గూండాలు దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంట్లోకి చొరబడిన వారిని అడ్డుకుంటే.. టీడీపీ నేతలపై రాళ్లు విసిరారని మండిపడ్డారు. దాడి చేసిన వైసీపీ నేతలను వదిలేసి.. బాధితులైన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను పోలీసులు తోసేశారని, టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని ఆరోపించారు.

అచ్చన్న ఖండన ….

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నామని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా మంటగలిసిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ను జగన్ ఆఫ్ఘనిస్థాన్ గా మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నివాసంపై వైసీపీ గూండాలు దాడికి యత్నించడం దారుణమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని చెప్పారు. స్వతహాగా ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం కలిగిన జగన్… ఏపీని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేశారని అన్నారు.

వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై మాట్లాడితే తప్పా? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను లేవదీస్తే గూండాగిరి చేస్తారా? అని ప్రశ్నించారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఇంటిపై రౌడీ మూకను వేసుకొచ్చి రాళ్లతో దాడి చేస్తారా? అని నిలదీశారు.

జోగి రమేశ్ ఎమ్మెల్యేనా లేక గూండానా అని మండిపడ్డారు. దాడిని అడ్డుకోబోయిన టీడీపీ నేతలపై రాళ్లతో దాడి చేయడం అరాచకమని అన్నారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రెండున్నరేళ్లలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. జోగి రమేశ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని… లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Related posts

బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలి : ప్రవీణ్ కుమార్!

Drukpadam

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా టూర్ పై దుమారం!

Drukpadam

ఆరు నెలల తర్వాత హరీశ్ అన్న అవుట్ రఘునందన్‌ సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment