ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ తరగతుల్లో ఇక నుంచి నో తెలుగు .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
ఏపీలో డిగ్రీ నుంచి తెలుగు మీడియం ఎత్తివేత
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తూ ఉత్తర్వులు
గతేడాది 25 శాతం మంది మాత్రమే తెలుగు మీడియం ఎంచుకున్నారు
నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమంటున్న భాషా ప్రేమికులు
ఏపీ ప్రభుత్వం ఇక నుంచి డిగ్రీ పరీక్షల్లో తెలుగు మీడియం ఎత్తు వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే దీనిపై విమర్శలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికీ ఇంగ్లీష్ మీడియం కొంత ఇబ్బంది కరమైందే . అంటే కాకుండా ఏమి చదువుకోవాలి అనేది విద్యార్ధి ఇష్టానికి అనుగుణంగా ఉండాలి కానీ ప్రభుత్వం బలవంతగా రుద్దటం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మాతృభాషను జగన్ సర్కార్ ఖునీ చేసే కుట్రలకు పూనుకున్నాడని విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ కళాశాలల నుంచి తెలుగు మీడియం తెరమరుగు కాబోతోంది. ఇకపై అన్ని కళాశాలల్లోనూ తెలుగుకు బదులుగా ఆంగ్ల మాధ్యమాన్ని బోధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఆదేశించింది.
ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలు రెండూ అందుబాటులో ఉండగా, ఇకపై ఇంగ్లిష్ ఒక్కటే అమలు కానుంది. అంతేకాదు, విద్యార్థులందరూ ఇకపై ఇంగ్లిష్ మీడియంలోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గతేడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం 2,62,805 మంది ప్రవేశాలు పొందగా, వారిలో 25 శాతం మంది అంటే 65,701 మంది మాత్రమే తెలుగు మీడియంలో చేరారు. వీరిలోనూ ఎక్కువమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉన్నారు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడంతో వీరంతా తెలుగులో చదివే అవకాశాన్ని కోల్పోనున్నారు.
మరోపక్క, ప్రభుత్వ నిర్ణయంపై భాషా ప్రేమికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యను మాతృభాషలో అభ్యసించేలా నూతన జాతీయ విద్యావిధానం అవకాశం కల్పిస్తోందని, కానీ, రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరుగుతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.