Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య.. ఆకలితో ఐదురోజులు అల్లాడి మరణించిన 9 నెలల చిన్నారి!

ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య.. ఆకలితో ఐదురోజులు అల్లాడి మరణించిన 9 నెలల చిన్నారి
-బెంగళూరులో ఘటన
-కుమార్తెను అత్తారింటికి వెళ్లాలని కోరడంతో మనస్పర్థలు
-తన మాట ఎవరూ వినడం లేదని బంధువుల ఇంటికి వెళ్లిపోయిన తండ్రి
-ఇంట్లోని నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్య
-ఆకలితో మరణించిన చిన్నారి.. స్పృహకోల్పోయిన మూడేళ్ల పాప

కర్ణాటక రాజధాని బెంగళూరులో మనసులు పిండేసే విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థల కారణంగా నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోగా, 9 నెలల చిన్నారి ఐదు రోజులపాటు ఆకలితో అలమటించి మరణించాడు. మూడేళ్ల పాప ఆకలికి తట్టుకోలేక స్పృహతప్పిపోయినా బతికి ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. నగరంలోని తిగరళపాళ్య చేతన్ కూడలిలో శంకర్ కుటుంబం నివసిస్తోంది. ఆయన కుమార్తె సించన (33) రెండో కాన్పు కోసం ఇంటికి వచ్చింది. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తిరిగి అత్తారింటికి వెళ్లాలని తండ్రి ఆమెను కోరాడు. ఆమె వెళ్లేందుకు నిరాకరిస్తుండడంతో కుటుంబంలో గొడవలు చెలరేగాయి. ఇంట్లోని ఎవరూ తన మాటను వినడం లేదని మనస్తాపం చెందిన శంకర్ ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు.

శుక్రవారం రాత్రి తిరిగి ఇంటికి రాగా తలుపులు వేసి ఉన్నాయి. ఇంట్లో అలికిడి లేకపోవడంతో అనుమానంతో కిటీకి నుంచి చూసిన ఆయనకు గుండె ఆగినంత పనైంది. ఆయన భార్య భారతి (50), కుమార్తెలు సించన, సింధురాణి (30), కుమారుడు మధుసాగర (27) ఉరేసుకుని కనిపించారు. ఐదు రోజుల క్రితమే వీరంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

వీరి మరణం తర్వాత ఒంటరైన సించన తొమ్మిది నెలల కుమారుడు ఆకలికి తాళలేక ఏడ్చి ఏడ్చి మరణించగా, మూడేళ్ల కుమార్తె ప్రేక్ష స్పృహ కోల్పోయి అచేతనంగా పడి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

వివేకా హత్యతో ఎర్ర గంగిరెడ్డి ,సునీల్ కుమార్ ,దస్తగిరిల ప్రమేయం పై అనుమానాలు!

Drukpadam

కేరళలో కీచక టీచర్ …60 మందిపై అఘాయిత్యం

Drukpadam

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు: లండన్ హైకోర్టు కీలక తీర్పు…

Drukpadam

Leave a Comment