ఇందిరాగాంధీ, ఎన్టీఆరే ఓడిపోయారు… కేసీఆర్ ఎంత?: ఈటల రాజేందర్!
-కేసీఆర్ కు కలలో కూడా హుజూరాబాదే కనిపిస్తోంది
-నాకు బొంద పెట్టాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు
-కేసీఆర్ కుట్రలను హరీశ్ అమలు చేస్తున్నారు
అసెంబ్లీలో తన మొహమే కనపడకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. తాను రాజీనామా చేసి ఐదు నెలలు అవుతోందని… హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీఆర్ఎస్ నేతలందరూ మోహరించారని అన్నారు. కేసీఆర్ కు కలలో కూడా హుజూరాబాదే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుట్రలు రచిస్తుంటే… హరీశ్ రావు వాటిని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కుట్రలు చేస్తున్న వారు ఏదో ఒక రోజు ఇరుక్కోక తప్పదని అన్నారు.
హుజూరాబాద్ ఎన్నికలు రెండు గుంటలు ఉన్నవారికి, 200 ఎకరాలు ఉన్న వారికి మధ్య జరుగుతున్న ఎన్నికలని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని… మరి రెండు గుంటలు ఉన్న వ్యక్తి 200 కోట్లు పెట్టి నేతలను ఎలా కొంటున్నాడని ఈటల ప్రశ్నించారు. వందలాది లారీల లిక్కర్ ను జనాలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. తనను బొంద పెట్టేందుకు కేసీఆర్ అన్ని కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అన్నీ పెండింగ్ లోనే ఉన్నాయని… ఎక్కడా ఇవ్వనివి హుజూరాబాద్ లోనే ఇస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు చాలా తెలివైన వారని… ఇచ్చేవన్నీ తీసుకుని, చివరకు కర్రు కాల్చి వాతపెడతారని అన్నారు.
కాళీమాత అని ప్రకటించుకున్న ఇందిరాగాంధీ, తన చెప్పును నిలబెట్టినా గెలుస్తుందన్న ఎన్టీఆర్ వంటి గొప్ప నేతలనే ప్రజలు ఓడించారని… కేసీఆర్ ఎంత అని ఈటల ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. రేషన్ బియ్యానికి రూ. 10 వేల కోట్లు ఖర్చయితే అందులో రూ. 7 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఐకేపీ సెంటర్ లో ఉండే ప్రతి గింజకు కేంద్రమే డబ్బు ఇస్తుందని చెప్పారు.