Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గులాబ్ తుపానుపై సీఎం జగన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ!

గులాబ్ తుపానుపై సీఎం జగన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ!
-అమెరికా నుంచి తిరిగొచ్చిన మోదీ
-గులాబ్ తుపానుపై సమీక్ష
-సీఎం జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్న వైనం
-ఏపీకి కేంద్రం అండగా ఉంటుందని హామీ

అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ…. ఏపీ, ఒడిశా రాష్ట్రాల వైపు దూసుకొస్తున్న గులాబ్ తుపానుపై దృష్టి సారించారు. ఏపీ సీఎం జగన్ తో గులాబ్ తుపానుపై మాట్లాడారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు నేపథ్యంలో కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందుతుందని సీఎం జగన్ కు మోదీ హామీ ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న గులాబ్ తుపాను ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్ పూర్ కు 140 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తాకనుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ అర్ధరాత్రి కళింగపట్నం-గోపాల్ పూర్ మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని పేర్కొంది.

గులాబ్ ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 75 నుంచి 95 కిమీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. గులాబ్ ప్రభావం తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా, విదర్భలపైనా ఉంటుందని వివరించారు.

తుపాను పరిస్థితులపై ఆరా తీసిన సీఎం జగన్…అధికారులకు దిశానిర్దేశం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, ఇది తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరించిన నేపథ్యంలో సీఎం జగన్ తుపాను పరిస్థితులపై ఆరా తీశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలు వాడుకోవాలని సూచించారు.

సచివాలయాల వారీగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఉత్తరాంధ్రలో విపత్తు నిర్వహణ సిబ్బందిని సిద్ధం చేశామని వివరించారు. తుపాను తీరం దాటాక భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ఆ మేరకు తీర ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

అటు, కోస్తాంధ్రకు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. సముద్ర తీరప్రాంతాల్లో ఉండే మత్స్యకార కుటుంబాలను అప్రమత్తం చేయాలని ఆదేశించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తరలించారు. ఒడిశా, కోస్తాంధ్ర తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

తుపాను వల్ల ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అలల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గాలులు, వర్షాలకు విద్యుత్ లైన్లు, వృక్షాలు, సెల్ టవర్లు కూలే ప్రమాదం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకుని వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

జగన్ గులాబీ తుఫాన్ ప్రభావంపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ యంత్రాగం అంత తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో 24 గంటలు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు.

Related posts

ధరణి భూసమస్యలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. పరిష్కారానికి 15నుండి రెవెన్యూ సదస్సులు

Drukpadam

విజయవాడ స‌ర్కారీ స్కూల్లో సింగిల్ సీటు కోసం పోటీ ప‌రీక్ష‌!…

Drukpadam

ఆనందయ్య మందు వల్ల ఎవరికీ నష్టం జరగనప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు?: చిన్నజీయర్ స్వామి

Drukpadam

Leave a Comment