పార్టీ కోసం జగన్ కంటే షర్మిల ఎక్కువ కష్టపడ్డారు: రఘురామ!
- ఓపెన్ హార్ట్ కార్యక్రమానికి విచ్చేసిన షర్మిల
- షర్మిల వెల్లడించిన అంశాలపై రఘురామ విశ్లేషణ
- సజ్జల వ్యాఖ్యలు దురదృష్టకరమని కామెంట్
- అది వారి అంతర్గత వ్యవహారమని స్పష్టీకరణ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా అనేక అంశాలపై స్పందించారు. వైఎస్ షర్మిల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో వెలిబుచ్చిన అభిప్రాయాలను విశ్లేషించారు. పార్టీ కోసం జగన్ కంటే షర్మిల ఎక్కువ కష్టపడ్డారని అన్నారు.
సజ్జల ఓ దశలో షర్మిలతో తమకు సంబంధం లేదని చెప్పడం దురదృష్టకరమని పేర్కొన్నారు. షర్మిల కూడా పార్టీ కోసం ఎంతో ప్రచారం చేశారని, తామందరి విజయం కోసం ఆమె కూడా కృషి చేశారని చెప్పారు. కానీ ఆమెతో వైసీపీకి సంబంధం లేదని చెప్పేందుకు ఎలాంటి అంశాలు దారితీశాయో అది వారి అంతర్గత వ్యవహారమని అన్నారు.
అసలు, వైసీపీలో తనకు సభ్యత్వమే లేదని షర్మిల చెప్పడంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని రఘురామ పేర్కొన్నారు. పార్టీలో షర్మిలకు ఎంతో పాప్యులారిటీ ఉందని, వాళ్ల అన్నయ్య జగన్ సభలకు వచ్చినంత మంది జనం షర్మిల సభలకు కూడా వచ్చేవారని అన్నారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందనేది ఇంటర్వ్యూలో షర్మిల మాటలను బట్టి అర్థమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.